ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్లదాడి భద్రతా వైఫల్యం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడిగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. జగన్ మీద దాడి ఆకతాయిల పని కాదన్న సజ్జల.. ఎయిర్ గన్ సాయంతో దాడి జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘటనపై సజ్జల విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సైతం సజ్జల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ జగన్‌కు తగిలిన రాయి కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేదని సజ్జల అన్నారు. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయే ప్రమాదం ఉండేదని అభిప్రాయపడ్డారు. జగన్‌కు తగిలిన రాయి అంతే వేగంగా పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలి ఆయన సైతం గాయపడ్డారంటే రాయి ఎంత వేగంగా వచ్చి ఉండాలో గమనించాలని సజ్జల అన్నారు. ఎయిర్ గన్ సాయంతో దాడి చేసినట్లు సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ జగన్ మీద దాడి జరిగితే.. నటన అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
" కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడమీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాటలు మాట్లాడతారా. ఎవరైనా సెస్సిటివ్ పార్ట్ మీద దాడి చేయించుకుంటారా. కొంచెం కిందకు తగిలితే కన్నుపోయేది. పక్కకు తగిలితే ప్రాణం పోయేది. దాడి జరిగినప్పుడు వైసీపీ వాళ్లు సందేహాలు వ్యక్తం చేయడం సహజం. అలాంటప్పుడు మేము చేయలేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతారా. అధికారుల వైఫల్యం అని చెప్తారా.. విశాఖపట్నంలో దాడి జరిగితే జగన్ అభిమానులే చేశారని చేతులు దులుపుకున్నారు. కోడికత్తి శ్రీను అని ఇప్పుడది ఎగతాళ్లి అయ్యింది. ఇప్పుడేమో కోడికత్తి 2.0 అని ఎగతాళి చేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా.. సమాజంలో ఉండటానికి అర్హులేనా" అని సజ్జల మండిపడ్డారు.
ఇక నటించడం టీడీపీ నేతలకు, చంద్రబాబు అలవాటని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. జగన్‌కు అలాంటి అలవాట్లు లేవని అన్నారు. ఇది పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అని సజ్జల ఆరోపించారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారని చెప్పారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారని రేపటి నుంచి యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.