వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర అశేష జనవాహిని మధ్య కేసరపల్లి నుంచి ప్రారంభమైంది. కేసరపల్లి రాత్రి బస చేసిన ప్రాంతానికి మంత్రులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు భారీగా తరలివచ్చారు. కేసరపల్లిలోని నైట్ స్టే పాయింట్ నుంచి ఉదయం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఎడమ కంటిపైన కనుబొమ్మకు గాయమైనప్పటికీ సీఎం వైయస్ జగన్ వైద్యుల సూచనల మేరకు ఒక్క రోజు విరామం తీసుకొని మళ్లీ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈరోజు యాత్ర గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, మీదుగా జొన్నపాడు చేరుకుంటుంది. జొన్నపాడు వద్ద సీఎం వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.