ఏపీలో ఎన్నికల సమయం వచ్చేసరికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయని, 2019లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి... ఘటనపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో శత్రువులు ఉండరని.. ప్రత్యర్ధులే ఉంటారని అన్నారు. అయితే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని అంటున్నారని.. ఇది భద్రత వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. తప్పు మీ వైపు పెట్టుకుని ప్రతిపక్షపార్టీలపై ఆరోపణలు చేస్తారా?.. డీజీపీ, డీఐజీ ఏమి చేస్తున్నారు?.. నిద్రపోతున్నారా?.. సీఎంకే భద్రత కల్పించలేని వారు ప్రజలకేమి భద్రత కల్పిస్తారని నిలదీశారు. సానుభూతితో ఓట్లు పొందలేరని, ఓటు అడిగే నైతిక హక్కుని జగన్ కోల్పోయారని, పంచభూతాలనూ వదలలేదని, ఏపీని గంజాయాంధ్రప్రదేశ్‌గా మార్చారని, తులసీవనం లాంటి తిరుపతి, ఇప్పుడు గంజాయి వనంగా మారిపోయిందని భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అభివృద్ది అంటే ప్రధాని నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలని, ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా మోదీ పాలిస్తున్నారని కొనియాడారు. జగన్‌కు మహిళలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, అసెంబ్లీ సాక్షిగా మహిళలను అగౌరవంగా మాట్లాడారని అన్నారు. కోవూరులో గెలిచే దమ్ములేకనే ఎమ్మెల్యే ప్రసన్న, ఎన్టీఏ మహిళా అభ్యర్ధిని కించపరుస్తూ మాట్లాడుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. భారత్ వికాస్ మాదిరిగా... తిరుపతి వికాస్... నెల్లూరు వికాస్.. ఇలా ప్రతి ప్రాంత అభివృద్ది కోసమే కూటమి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. జగన్‌కు ఈ బస్సుయాత్రే చివరి యాత్రని.. ఇక తీర్దయాత్రే దిక్కని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో ఏపీని సంక్షోభంలోకి తీసుకువెళ్లిన వ్యక్తి... జగన్ అని, ఏపీలో ప్రతి పౌరుడి నెత్తిపై రూ. 2.5లక్షల అప్పును మోపారని అన్నారు. జగన్... ఓ ఫెయిల్యూర్ సీఎం అని భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.