అనంతపురంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కి.మీ.లు కారుతోసహా లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళ సముద్రానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ జిన్నే ఎర్రి స్వామి(35)కి ఆత్మకూరు మండలంలోని పి సిద్దరాంపురానికి చెందిన మంజులతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. వీరు అనంతపురంలో స్థిరపడ్డారు. వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై సిద్దరాంపురానికి వెళ్లిన ఎర్రిస్వామి రాత్రి 10 గంటల ప్రాంతంలో అనంతపురానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. వై కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపైకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడి మృతి చెందాడు. మద్యం సేవించి ఉన్న కారు డ్రైవర్ ఈ విషయాన్ని గమనించకుండా వేగంగా కళ్యాణదుర్గం వైపు తీసుకెళ్లాడు. అలా 18 కి.మీ.ల దూరం వెళ్లాక హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి కారును ఆపారు. విషయం తెలుసుకున్న డ్రైవర్ కారును అక్కడే వదిలి పరారయ్యాడు. స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్ద దిక్కు పోయేసరికి వారి కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది.