నిద్ర మానవ ప్రాథమిక అవసరమని, దానిని ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ కేసులో ఒక సీనియర్ సిటిజన్‌ను రాత్రంతా ప్రశ్నించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. స్టేట్‌మెంట్‌లను తప్పనిసరిగా పగటిపూట మాత్రమే రికార్డ్ చేయాలని, ఒక వ్యక్తి జ్ఞానాత్మక నైపుణ్యాలు బలహీనంగా రాత్రిపూట కాదని ఈ మేరకు జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ రామ్ ఇస్సారీ అనే 64 ఏళ్ల వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టి.. ఈ వ్యాఖ్యలు ేసింది. గతేడాది ఆగస్టులో రామ్ ఇస్సారీని ఈడీ అరెస్ట్ చేసింది.
తన అరెస్ట్ అక్రమమని, కనీసం వారెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సమన్లు జారీచేసిన ప్రతిసారీ ఈడీ విచారణకు హాజరవుతునే ఉన్నానని పేర్కొన్నారు. సమన్ల జారీచేయడంతో ఈడీ విచారణకు 2023 ఆగస్టు 7న హాజరయ్యాయని, ఆ రాత్రంతా ప్రశ్నించి, మర్నాడు అరెస్ట్ చేశారని పిటిషన్‌లో వెల్లడించారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించినా.. రాత్రి మొత్తం ఆయనను విచారించడాన్ని తప్పుబట్టింది. రాత్రంతా తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఇస్రానీ సమ్మతించారని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది హితేన్ వెనెగావ్కర్ కోర్టుకు నివేదిక సమర్పించారు.
ఆయన సమ్మతి మేరకు ఇస్రానీని ఈడీ అధికారులు తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రశ్నించారని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘స్వచ్ఛందంగా లేదా వేరే విధంగా పిటిషనర్ స్టేట్‌మెంట్‌ను అర్థరాత్రి 3.30 గంటల వరకు రికార్డ్ చేసిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.. నిద్రపోవడం అనేది మనిషి ప్రాథమిక అవసరం.. అదే విధంగా ఆయనను నిద్రపోకుండా ఉంచడం ఒక వ్యక్తి మానవ హక్కులను ఉల్లంఘిస్తుంది’ అని కోర్టు పేర్కొంది. నిద్రలేమి వల్ల వ్యక్తి ఆరోగ్యంతో పాటు పాక్షికంగా మానసిక సామర్ధ్యాన్ని, జ్ఞానాత్మక నైపుణ్యాలను దెబ్బతీస్తుందని తెలిపింది.
‘సమన్లు జారీచేసిన వ్యక్తిని సహేతుకమైన సమయానికి మించి ఈడీ విచారించడం కుదురదు.. అతడి ప్రాథమిక మానవ హక్కు అంటే నిద్రించే హక్కును ఉల్లంఘించడమే.. స్టేట్‌మెంట్‌లు తప్పనిసరిగా పగటి సమయంలో తప్పనిసరిగా రికార్డ్ చేయాలి ... వ్యక్తి జ్ఞానాత్మక నైపుణ్యాలు బలహీనపడే రాత్రిలో కాదు.. ఒక వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు అతడు నేరానికి పాల్పడినట్లు నిర్దారణకు దర్యాప్తు సంస్థ ఇంకా రాలేదు.. పిటిషనర్ గతంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఏజెన్సీ ముందు హాజరయ్యారు’ అని ధర్మాసనం పేర్కొంది.
పిటిషనర్‌ను అర్ధరాత్రి దాటిన వరకూ ఉంచకుండా మరేదైనా రోజు లేదా మర్నాడు కూడా పిలవచ్చని స్పష్టం చేసింది. ‘సమ్మతి అనేది అసంభవం.. నిద్రిపోయే సమయాల్లో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడం అనేది ఒక వ్యక్తి ప్రాథమిక మానవ హక్కు అయిన నిద్రను ఖచ్చితంగా కోల్పోతుంది. ఈ పద్దతిని మేము వ్యతిరేకిస్తున్నాం’ అని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.