భారత్లో బాలికల విద్య కోసం కృషి చేసిన ఓ విదేశీ మహిళ 112 ఏళ్ల కిందట జరిగిన టైటానిక్ పడవ ప్రమాదంలో కన్నుమూశారు. కళ్లముందు మృత్యువు కనిపిస్తున్నా తన ప్రాణాలను సైతం లెక్కచేయక.. లైఫ్ జాకెట్ను ఓ చిన్నారికి ఇచ్చి ఆమె ప్రాణం వదిలారు. ఆ త్యాగమూర్తి మరణించి వందేళ్లు గడిచిపోయినా ఇంకా చత్తీస్గఢ్ ప్రజలు ఆమె సేవలను ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నారు. అమెరికాకు చెందిన మిస్ అన్నే క్లెమెర్ ఫంక్.. 1912 ఏప్రిల్ 14న అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో జరిగి 112 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటున్నారు. అయితే, ఇంతకీ భారత్లో ఆమె చేసిన సేవలు ఏంటి? ఆమెపై ఎందుకు అంతటి అభిమానం చూపుతున్నారో తెలుసుకోవాల్సిందే.
మిస్ అన్నే క్లమెర్ ఫంక్.. 1874 ఏప్రిల్ 12న అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించారు. మహిళా విద్య గురించి అవగాహన కల్పించడానికి 32 ఏళ్ల వయసులో ఆమె 1906లో భారత్‌లో అడుగుపెట్టారు. చత్తీస్గఢ్లోని జాంజ్‌గిర్ చంపా ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. 1907లో అక్కడే ఓ మోమోరియల్ పాఠశాలను స్థాపించారు. అక్కడ చదువుతోన్న 17 మంది బాలికల కోసం ఓ వసతి గృహన్ని కూడా నెలకొల్పారు. అయితే, తన తల్లి ఆరోగ్యానికి గురైనట్టు 1912 ఏప్రిల్ 6న ఫంక్కు సమాచారం రావడంతో స్వదేశానికి బయలుదేరారు. జాంజ్‌గిర్ చంపా నుంచి ముంబయి, అక్కడ నుంచి బ్రిటన్‌కు చేరుకున్నారు.
అక్కడ నుంచి అమెరికాకు SSహెవాఫోడ్జ్ అనే నౌకలో ఆమె ప్రయాణించాల్సి ఉంది, కానీ ఆ రోజు బొగ్గు కార్మికుల సమ్మె కారణంగా దాని రద్దయ్యింది. దీంతో అదనంగా 13 పౌండ్లు చెల్లించి టైటానిక్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. 1912 ఏప్రిల్ 10న యూకే పోర్టు నుంచి టైటానిక్ బయలుదేరింది. ప్రమాదం జరగానికి రెండు రోజుల ముందు ఏప్రిల్ 12న ఓడలోనే తన పుట్టినరోజును జరుపుకోవడం గమనార్హం. మంచుకొండను ఢీకొట్టి నౌక మునిగిపోతున్న సమయంలోనూ ఫంక్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓడలో చిక్కుకున్న ఓ తల్లి, ఆమె బిడ్డకు తన లైఫ్ జాకెట్‌ను అందించారు. కానీ, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో అన్నే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరణించే సమయానికి ఫంక్ వయసు 38 ఏళ్లు. తమ ప్రాంతంలో ఫంక్ చేసిన సేవలకు జాంజ్ గిర్ చంపాలోని ప్రజలు విద్యాదేవతగా పిలుచుకుంటారు. ఫంక్ మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ సరోజినీ సింగ్ అన్నే గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘జాంజ్ గిర్ చంపాలోని ఓ అద్దె ఇంట్లో తొలుత మెమోరియల్ పాఠశాలను ప్రారంభించారు.. బాలికల కోసం ఒక హాస్టల్‌ను కూడా నిర్మించారు.. ఆ స్కూల్ 1960 వరకు నడిచింది. అనంతరం అనివార్య కారణాల వల్ల పాఠశాల, హాస్టల్ ను మూతబడింది... 1960 నుంచి ఈ పాఠశాలను సొసైటీ నిర్వహిస్తోంది.. 2007లో ఈ స్కూల్‌కు మిస్ ఫంక్ స్కూల్ అని పేరు పెట్టారు.. కానీ తర్వాత దాని పేరు మిస్ ఫంక్‌గా మార్చారు. అన్నే మరణానంతరం అమె ప్రారంభించిన పనులను ఇతర మిషనరీలు పూర్తి చేశాయి.. ఇప్పటికీ ఆ మిషనరీలు విద్య, ఆరోగ్యం, ప్రజా సేవకోసం పనిచేస్తున్నాయి’ అని సరోజిని సింగ్ పేర్కొన్నారు.