కర్ణాటక రాష్ట్రంలో గ్రూపు విభేదాలతో పాటు నాయకత్వ మార్పు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే చర్చలు సాగుతున్న తరుణంలోనే రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి సతీశ్ జార్కిహొళి రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లను కలిశారు. ఆయన ఏ అంశాలపై చర్చలు జరిపారనేది అంతుచిక్కని రహస్యంగా మారింది.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తున్నా త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్పు చేయాలనే డిమాండ్ సాగుతున్న తరుణంలోనే సతీశ్‌జార్కిహొళి ఢిల్లీ వెళ్ళడం రాష్ట్ర రాజకీయాల్లో కుతూహలంగా మారింది.
ఇదే సందర్భంలోనే సహకార శాఖా మంత్రి రాజణ్ణ కూడా ఢిల్లీ వెళ్ళడం ఆసక్తి రేకెత్తిస్తోంది. వీరిద్దరూ మంత్రులు సీఎం సిద్దరామయ్య గ్రూపునకు చెందినవారనే పేరుంది.పలు సందర్భాల్లో డీకే శివకుమార్ వ్యాఖ్యలకు తిప్పికొట్టేలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. జనవరి మొదటి వారంలో హోంమంత్రి పరమేశ్వర్ ఏర్పాటు చేసిన దళిత మంత్రులకు విందు రాజకీయంగా మారుతుందనే కారణంతో గంటల వ్యవధిలో అధిష్టానం బ్రేక్ పెట్టిన తర్వాత తాజాగా అటువంటి విందు భేటీలకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలోనే సతీశ్ జార్కిహోళి ఢిల్లీ వెళ్ళడం, మరో వైపు హోంమంత్రి పరమేశ్వర్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడంతో రాజకీయంగా చర్చలు జోరందుకున్నాయి.