గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వల్లభనేని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్ట్ ఉదంతం అద్దం పడుతోందని అన్నారు.
తెలుగుదేశం కార్యాలయంలోపై దాడికి వల్లభనేని వంశీ కారణం అంటూ గతంలో సత్యవర్థన్ అనే వ్యక్తిని బెదరించి తెలుగుదేశం నేతలు తప్పుడు కేసు పెట్టించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సత్యవర్థన్ తనతో తెలుగుదేశం నేతలు బెదిరించి వంశీపై తప్పుడు కేసు పెట్టించారంటూ న్యాయమూర్తి ముందు వాగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఈ రోజు న్యాయస్థానం విచారణ నేడు జరుగుతున్న నేపథ్యంలో హటాత్తుగా సత్యవర్థన్ కుటుంబసభ్యులతో వల్లభనేని వంశీపై ఒక తప్పుడు ఫిర్యాదు చేయించడం, వెంటనే హైదరాబాద్ లోని వంశీని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అంటే ఎంత పకడ్బందీ ప్రణాళికతో వంశీని అరెస్ట్ చేయించేందుకు తెలుగుదేశం పెద్దలు ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. అధికారం ఉందని, పోలీస్ వ్యవస్థను కీలుబొమ్మలా మార్చి, వైయస్ఆర్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్ట్ లతో భయబ్రాంతులకు గురి చేసేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. శాంతిభద్రతలను కాపాడాల్పిన పోలీసులు తెలుగుదేశం నేతలకు ఊడిగం చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు కూడా గుర్తించాలి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిందో న్యాయస్థానం వ్యాఖ్యలను చూసి అర్థం చేసుకోవచ్చు. డీజీపీని పిలిపిస్తామంటూ హైకోర్ట్ హెచ్చరించడం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా తయారయ్యిందీ అనేందుకు నిదర్శనం. ఇప్పటికైనా పోలీసుల తీరులో మార్పు రావాలి. చట్టాలకు అతీతంగా పనిచేసే ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మల్లాది విష్ణు హెచ్చరించారు.