గిల్లన్ బ్యార్రే సిండ్రోమ్ (జీబీఎస్) అరుదైన వ్యాధి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల పరిధిలో పదేళ్ల బాలుడు ఈ వ్యాధి లక్షణాలతో ఇటీవల మరణిం చాడనే ప్రచారంతో... కలకలరం రేగుతోంది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమై బుధవారం ఆ గ్రామంలో పర్యటించింది. బాలుడి తల్లిదండ్రులను ఆరా తీసింది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేశారు. అయితే ఇది అంటు వ్యాధి కాదని, భయపడాల్సిన అవసరం లేదని దండుగోపాలపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డా.బి.సుధీర్ చెబుతున్నారు. కాపుగోదాయవలసలో వాతాడ యువంత్ (10) అనే బాలుడు ఈ వ్యాధితో మృతి చెందాడనే అనుమానంతో గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఇటువంటి వ్యాధి ఐదు లక్షల మందిలో ఒకరికి వస్తుందని తెలిపారు. శరీరంలో సోకిన ఇన్‌ఫెక్షన్ రోగిని కృంగదీస్తుందన్నారు. ముందుగా గొంతు నొప్పి, దగ్గు, డయేరియా, జ్వరంతో ప్రారంభమవుతుందని తెలిపారు. శరీర కణజాలాలను నిర్వీర్యం చేసి ఊపిరి ఆడకుండా చేస్తుందని తెలిపారు. దీనిపై గ్రామంలో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
ఇంకా ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నాయేమోననే విషయమై గ్రామంలో వైద్య సిబ్బందితో సర్వే చేశామని వివరించారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఇద్దరు చిన్నపిల్లల వైద్య నిపుణులు ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారని ఆయన తెలిపారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని సూచించామన్నారు. ఈ వ్యాధి సోకిందని గుర్తించడానికి మూడు రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వివరించారు. ఒక్క రకం వైద్య పరీక్ష మాత్రమే చేసినందున యువంత్ ఈ వ్యాధితో మృతి చెందాడని నిర్ధారణకు రాలేకపోతున్నామని వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో వైద్య పరీక్షలు చేశామని వైద్యాధికారి సుధీర్ తెలిపారు.
![]() |
![]() |