బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులకు పాల్పడిన ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ఈ ఇద్దర్నీ గుజరాత్‌లోని భుజ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. కాల్పులు జరిపిన తర్వాత ముంబయి నుంచి నిందితులు గుజరాత్‌లోకి భుజ్‌కు పారిపోయారని చెప్పారు. తదుపరి విచారణ కోసం వారిని ముంబయికి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఉదయం 4.50 గంటల ప్రాంతంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఉంటోన్న ముంబయిలోని బంద్రా గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట బైక్‌వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే.
ఈ ఘటనతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్లు ధరించి ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు.. దాడికి ప్రయత్నించినట్టు ప్రాథమిక విచారణంలో నిర్దారించారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ సల్మాన్ ఇంటి బాల్కనీలోకి దూసుకెళ్లింది. ఇటీవల కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఇద్దరు వ్యక్తులను విచారణకు పిలిచింది.
ఈ ఘటన అనంతరం సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. ముంబయి పోలీస్ కమిషనర్‌తో కూడా చర్చించి ఆయనకు భద్రతను పెంచాలని సూచించారు.గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్‌కు నవంబరు 2022 నుంచి భద్రతను Y-ప్లస్‌కి పెంచారు. వ్యక్తిగత తుపాకీని తీసుకెళ్లడానికి కూడా సల్మాన్‌కు అనుమతి లభించింది. అదనపు రక్షణ కోసం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఇక, కాల్పులకు అమెరికాలో ప్లాన్ చేసి, అమలుచేసినట్టు పోలీసులు గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అమెరికా నుంచి అమలుచేసినట్టు భావిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుడి భుజంగా భావించే రోహిత్ గోదారా.. అన్మోల్ కోరిక మేరకు ఇద్దరు వ్యక్తులతో కాల్పులు జరిపించినట్లు దర్యాప్తులో తేలింది. కాల్పులు జరిపిన వ్యక్తుల కదలికలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితుల్లో ఒకరిని విశాల్‌గా గుర్తించిన పోలీసులు.. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక వ్యక్తి అని తెలిపారు. కాల్పుల ఘటనలో దుండగులు ఉపయోగించిన బైక్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బైక్‌ను వారం రోజుల కిందటే వేరేవ్యక్తికి అమ్మినట్లు అతడు చెప్పాడు. ఆ బైక్‌తో ఇద్దరూ ముంబయికి చేరుకుని.. తెల్లవారుజామున కాల్పుల జరిపి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ కాల్పులకు తామే పాల్పడినట్టు అన్మోల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. ఇది ట్రైలర్ మాత్రమే అని హెచ్చరించాడు.