సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఇక రేపో మాపో స్కూళ్లకు కూడా సెలవులు వచ్చేస్తాయ్. ఈ సెలవుల్లో అలా అలా విహారయాత్రలకు వెళ్దామని చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది సమయం లేక వెళ్లలేకపోతే.. మరికొంత మంది ఖర్చు భయంతో వెనుకడుగు వేస్తుంటారు. సగటు మధ్యతరగతి కుటుంబం మాత్రం జేబులో బరువు చూసుకుని ఇలాంటి విహారయాత్రల గురించి, తీర్థయాత్రల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి వారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. షిర్డీ వెళ్లి ఆ సాయినాథుణ్ని దర్శించుకోవాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చింది.
విజయవాడ నుంచి షిరిడీకి వెళ్లాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. సాయి సన్నిధి విజయవాడ పేరుతో ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ అందిస్తున్నారు. నాలుగు రోజులపాటు ఈ యాత్ర జరుగుతుంది. ఈ ప్యాకేజీ ప్రకారం విజయవాడ నుంచి ప్రతి మంగళవారం రాత్రి 10.15 గంటలకు షిరిడీకి ట్రైన్ సర్వీస్ మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్‌లలో ఈ ట్రైన్ ఆగనుంది. బుధవారం ఉదయం 06.15 గంటలకు ఈ ట్రైన్ నాగర్‌సోల్ చేరుకుంటుంది. అక్కడి నుంచి షిరిడీకి వెళ్లాల్సి ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ టూర్ ప్లాన్ ప్రకారం బుధవారమే షిరిడీ సాయిబాబా దర్శనం చేసుకుంటారు. ఆ రోజు రాత్రి షిరిడీలోనే బస ఉంటుంది. గురువారం ఉదయం శనిశిగ్నాపూర్‌లో శనీశ్వరుడి దర్శనం తర్వాత మళ్లీ షిరిడీకి తీసుకువస్తారు. అదే రోజు రాత్రి ఏడున్నర గంటలకు నాగర్‌సోల్ నుంచి రైలులో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. మొత్తంగా నాలుగురోజుల పాటు టూర్ సాగనుంది.
ఛార్జీల వివరాలకు వస్తే థర్డ్ క్లాస్ ఏసీ సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 16165గా నిర్ణయించారు. ఏసీ డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10045, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 8440గా ఉంది. ఇక స్లీపర్ క్లాస్‌కు సంబంధించి ట్రిపుల్ షేరింగ్ టికెట్ రూ.5985, డబుల్ షేరింగ్ టికెట్ 7590, సింగిల్ షేరింగ్ టికెట్ ధర రూ.13705గా ఉంది.