ఏపీలో ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు గురువారం ( ఏప్రిల్18) నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏప్రిల్ 25 చివరి తేదీగా నిర్ణియంచారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 ముఖ్యమైన తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18
నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 18 నుంచి
నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ మే 13
ఎన్నికల ఫలితాలు జూన్ 4
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో బరిలో ఉంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ.. వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. జై భారత్ నేషనల్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ సహా పలు పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి.
మరోవైపు నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తారు. అభ్యర్థితో పాటుగా మరో నలుగురు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. పబ్లిక్ హాలీడేలు, ఆదివారం రోజున నామినేషన్ల స్వీకరణ ఉండదు. అలాగే గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో సర్వేలకు ఫుల్ స్టాప్ పడనుంది. గురువారం నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఒపీనియన్ పోల్స్, ప్రీపోల్స్, ఎన్నికల సర్వేలు వెల్లడించడం నిషేధం.