ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఏపీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం (ఏప్రిల్ 18) వెల్లడి కానుంది. మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలకు సంబంధించి జనసేన.. ఏపీలోని మిగతా రాజకీయ పార్టీల కంటే ఓ అడుగు ముందు నిలిచింది. అభ్యర్థుల ప్రకటనలో అన్ని పార్టీలతో పోలిస్తే.. కాస్త వెనుక నిలిచిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ.. ఆ విషయంలో మాత్రం మిగతా పార్టీల కంటే చాలా ముందు నిలిచింది. అదే అభ్యర్థులకు భీఫామ్‌లు అందజేయడం. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేశారు.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తోంది. మూడు పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు కేటాయించారు. అయితే అభ్యర్థుల ప్రకటనలో కూటమి పార్టీలతో పాటుగా అధికార వైసీపీ కంటే వెనుక నిలిచింది జనసేన. టీడీపీ, బీజేపీ, వైసీపీ పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యాక కానీ.. మొత్తం 21 సీట్లకు జనసేన అభ్యర్థుల పేర్లు వెల్లడించలేదు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు ఆఖరిగా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీలో నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణకు ఈ సీట్లు కేటాయించారు.
అయితే అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం చేసిన పవన్ కళ్యాణ్ బీ ఫామ్ అందించడంలో చాలా ముందున్నారు. తమ తరుఫున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోవటంతో.. వారందరికీ బీ ఫామ్‌లు అందజేశారు. మార్పులు, చేర్పులు కూడా లేకపోవటంతోనే పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పవిత్ర రామనవమి రోజు కావటం కూడా ఓ కారణమని సమాచారం. అయితే 21 మంది అభ్యర్థులకు జనసేనాని బీఫామ్‌లు అందించలేదు. 20 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల అభ్యర్థులకు మాత్రమే బీఫామ్ అందించారు. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రావటం ఆలస్యం కావటంతో ఆయనకు తర్వాత బీఫామ్ ఇస్తారని సమాచారం.
బీఫామ్‌లు అందించిన అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడిప్పుడే ఏపీలో రామరాజ్యం వైపు అడుగులు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్న పవన్ కళ్యాణ్.. పోలవరం నిర్మాణం పూర్తి, నదుల అనుసందానం, సామాజిక న్యాయం, యువతకు విద్యా, ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలన్నారు. ఇందుకోసం ఎన్డీయే కూటమి విజయానికి కృషి చేస్తామని అభ్యర్థులు అందరితో ప్రమాణం చేయించారు.