శ్రీరామనవమి పర్వదినాన్ని యావత్ భారత్ దేశం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంది. ఇక రామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ రామునిపై తమలో దాగున్న భక్తి భావాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. కొంతమంది పూజల ద్వారా ఆ రామయ్య మీదున్న భక్తిని తెలియజేస్తే.. మరికొంతమంది కళాకారులు తమ కళ ద్వారా రాముడిపై, హనుమంతుడిపై తమ భక్తిని తెలియజేశారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన పురుషోత్తం అనే కళాకారుడు.. హనుమాన్ మీద తన భక్తిని అద్భుత రీతిలో ప్రపంచానికి తెలియజేశాడు.
కుప్పం పట్టణానికి చెందిన పురుషోత్తం అనే ఆర్టిస్ట్ ఆంజనేయుడి మీద ఉన్న తన భక్తిని ఘనంగా చాటుకున్నాడు. 25 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో అతిపెద్ద హనుమాన్ స్కెచ్ వేసి అబ్బురపరిచాడు. అది కూడా అక్కడా ఇక్కడ కాదు. పచ్చటి పంట పొలాల మధ్య ఆ ఆంజనేయుడి అద్భుత రూపాన్ని ఆవిష్కరించారు. దీనిని రూపొందించేందుకు ఆయనకు రెండురోజులు పట్టిందట. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజనం.. మనోడి టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు.
అలాగే కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు రాజారెడ్డి కూడా రఘురాముడిపై తన భక్తిని ప్రదర్శించారు. గత 14 ఏళ్లుగా రాజారెడ్డి శంకుచక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు, రామనామ తలంబ్రాలు రాములోరి కళ్యాణానికి పంపుతున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా రాజారెడ్డి కొనసాగించారు. 100333 బియ్యపు గింజలపై రామ నామాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాసి కళ్యాణం కోసం పంపారు.
ఇక బియ్యపు గింజలపై రామనామాన్ని రాసేందుకు ఎలాంటి పరికరాలు ఉపయోగించలేదని.. కేవలం పెన్ సాయంతో వీటిని రాసినట్లు రాజారెడ్డి చెప్పారు. ఇలా రూపొందించిన తలంబ్రాలను, శంకుచక్రనామాలతో కూడిన కొబ్బరి బోండాలను సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో మామిడాలలోని శ్రీరామ ఆలయం ధర్మకర్తలకు అందించారు. ప్రతి ఏటా ఇలా అందించగలగడం తన అదృష్ణమని రాజారెడ్డి చెప్పారు.