హమాస్‌ను కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా గాజాపై దాదాపు ఏడు నెలలుగా ఇజ్రాయేల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. గతేడాది అక్టోబరు 7 నుంచి సాగుతున్న ఇజ్రాయేల్-హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకూ 34 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక అంచనా. ఈ క్రమంలో ఓ హృదయవిదారక అంశం వెలుగుచూసింది. ఇజ్రాయేల్ దాడి కారణంగా గాజాలో కృత్రిమ గర్భధారణ కోసం నిల్వ ఉంచిన వేలాది పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడయ్యింది. దీంతో సంతానం కోసం ఎదురుచూస్తోన్న వేలాది మంది జంటలకు ఆశలు అడియాశలయ్యాయి.
గాజాలోని అతిపెద్ద వైద్య కేంద్రాల్లో ఒకటైన అల్ బాస్మా ఐవీఎఫ్ సెంటర్‌పై ఇజ్రాయేల్ సైన్యం గతేడాది డిసెంబర్‌లో దాడులు నిర్వహించింది. ఈ ఘటనతో ఎంబ్రియాలజీ విభాగంలోని ఐదు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు దెబ్బతిన్నాయి. దీంతో ద్రవం ఆవిరై ట్యాంకుల లోపల ఉష్ణోగ్రతలు పెరిగి.. వేలాది పిండాలు, వీర్య నమూనాలు, ఫలదీకరణం చెందని అండాలు ఛిద్రమైనట్లు గుర్తించారు. ఈ పరిణామం సంతానం లేని వందల మంది దంపతులకు తీరని వేదనను మిగిల్చిందని ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు వెల్లడించారు.
అల్ బాస్మా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ బహేలిద్దీన్ ఘలాయినీ మాట్లాడుతూ.. ‘దాదాపు ఐదు వేల నమూనాల్లో జీవం పోసుకునే అవకాశం ఉన్నవి అధికంగా ఉన్నాయి. ఇందులో సగానికి పైగా దంపతుల నుంచి మళ్లీ నమూనాలు సేకరించడం కష్టమే.. వీరిలో సగం మందికి మరోసారి గర్బం దాల్చే అవకాశం లేదు.. ఇవన్నీ నిర్వీర్యం కావడం చూస్తుంటే నా హృదయం ముక్కలైపోతుంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐవీఎఫ్ విధానం సంతానం పొందడానికి ఎంతో మంది దంపతులు తమ టీవీలు, నగలను సైతం అమ్ముకున్నారని ఆయన తెలిపారు. కేంబ్రిడ్జ్‌లో గైనకాలజీని అభ్యసించిన ఘలాయినీ.. 1997లో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. పాలస్తీనా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. ఇక్కడ జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపు ఉన్నారు. సంతానోత్పత్తి రేటు 3.38గా ఉంది. గాజా పేదరికంలో ఉన్నప్పటికీ వంధ్యత్వాన్ని ఎదుర్కొంటున్న జంటలు ఐవీఎఫ్‌ను అనుసరిస్తారు. గాజాలో కనీసం తొమ్మిది హాస్పిటల్స్‌లు ఐవీఎఫ్ చికిత్సను నిర్వహిస్తున్నాయి.