పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జు ఇరకాటంలో పడ్డారు. గతంలో ఆయనపై వచ్చిన అవినితీ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తు నివేదిక లీక్ అయ్యింది. దీంతో ఈ అంశంపై విచారణ చేపట్టి, అధ్యక్షుడ్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మాల్దీవుల్లో ఆదివారం నాడు ఎన్నికల జరగనుండగా.. తాజా పరిణామాలు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమక్రటిక్ పార్టీ, అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ మధ్య మరింత అగ్గి రాజేశాయి. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన మొయిజ్జు.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కొట్టిపారేయడం గమనార్హం. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేశారని ఆయన గుర్తుచేశారు.
అధ్యక్షుడి మెయిజ్జు అవినీతితో ముడిపెడుతూ మాల్దీవుల మానిటరీ అథారిటీ, మాల్దీవుల పోలీసు సర్వీస్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయు) రూపొందించిన పత్రాలతో సహా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లను సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం రేగింది. 'హసన్ కురుసీ' అనే పేరుతో లీక్ కావడంతో సోమవారం నుంచి రాజకీయ తుఫాను ప్రారంభమైందని స్థానిక మీడియా పేర్కొంది. మాల్దీవుల్లోని మొత్తం 93 పార్లమెంట్ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగున్నాయి. బరిలో 368 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
2018 నాటి నివేదిక ప్రకారం.. ప్రెసిడెంట్ మొయిజ్జు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్టు పేర్కొంది. ఇందులో అక్రమాలు, ఆర్ధిక నేరాలకు సంబంధించిన 10 క్లిష్టమైన అంశాలను హైలెట్ చేసింది. ‘రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు, అపహరణ, నిర్మాణాత్మక లావాదేవీలు, ఫండ్ మూలాలను దాచిపెట్టడానికి కార్పొరేట్ సంస్థలను ఉపయోగించకున్నారనే ఆరోపణలు ఉన్నాయి" అని న్యూస్ పోర్టల్ మాల్దీవ్స్ రిపబ్లిక్ నివేదించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించిన నివేదిక లీక్ కావడంతో రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
ఇంటెలిజెన్స్ నివేదిక లీక్‌తో మెయిజ్జును పదవి నుంచి తొలగించాలని మాజీ అధ్యక్షఉడు డాక్టర్ మహ్మద్ జమీల్ డిమాండ్ చేశారు. రాస్ మాలే అభివృద్ధి ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మెయిజ్జు స్వతంత్ర విచారణకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. కాగా, ఎఫ్ఐయూ రిపోర్ట్ బహిర్గతం కావడం ఇదే మొదటిసారి అని స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాదు, దీనిపై ఇప్పటి వరకూ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ స్పందించలేదని తెలిపింది. ఇక, గతేడాది నవంబరులో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మహ్మద్ మెయిజ్జు విజయం సాధించి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.