ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్న కాలంలో ఏ విషయమైనా క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇక మరికొందరు మాత్రం వైరల్ అయ్యేందుకు నానాతంటాలు పడి.. అడ్డమైన పనులు చేస్తున్నారు. ఇక ఓ ప్రిన్సిపల్ మాత్రం ఏకంగా పాఠశాలలోనే దుకాణం పెట్టేసింది. ఓవైపు స్కూలులో క్లాసులు జరుగుతుండగానే ఫేషియల్ చేయించుకుంది. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా.. టీచర్ల గురించి పట్టించుకోకుండా స్కూలులోనే ఫేషియల్ చేయించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆ స్కూలు ప్రిన్సిపల్ సంగీతా సింగ్.. పిల్లలకు పాఠాలు చెప్పకుండా పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే గదిలో ఎంచక్కా ఫేషియల్ చేయించుకుంది. అది గమనించిన అనమ్ ఖాన్ అనే ఉపాధ్యాయురాలు దాన్ని వీడియో తీశారు. అయితే తనను వీడియో తీయడాన్ని గమనించిన ప్రిన్సిపల్ సంగీతాసింగ్ ఒక్కసారిగా కుర్చీపై నుంచి లేచి ఆ అనమ్ ఖాన్‌తో గొడవకు దిగారు. ఆ తర్వాత ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే అనమ్ ఖాన్ చేయిని సంగీతా ఖాన్ కొరకడంతో ఆమెకు తీవ్ర గాయమై రక్తస్రావం అయ్యింది.
దీంతో తీవ్ర ఆగ్రహంతో.. సంగీతా సింగ్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియోతో పాటు తనకు గాయమైన వీడియోను అనమ్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అనమ్ ఖాన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.