తమ సర్వీసులో ఒకసారైనా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డును అందుకోవాలని ప్రతి ఒక్క పోలీస్ కలగంటాడు. అలాంటిది ఓ పోలీస్ అధికారి తన 17 ఏళ్ల తన సర్వీసులో ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ఆయనే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ లక్ష్మణ్ కేవత్. ఇప్పటివరకు 100కు పైగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో పాల్గొన్న లక్ష్మణ్.. రెండు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఆపరేషన్‌కు వ్యూహకర్తగా వ్యవహరించారు. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్ట్ చరిత్రలోనే అతిపెద్ద ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే.
ఈ నేపథ్యంలో ఆపరేషన్‌కు సంబంధించి వ్యూహాలు, ఎదుర్కొన్న సవాళ్లను ఆయన మీడియాకు వివరించారు. ‘కొటారీ నదికి అవతలి వైపు ఉండే కొండ ప్రాంతాన్ని మావోయిస్టుల ‘లిబరేషన్’ జోన్‌గా పిలుస్తారు.. ఆ ప్రాంతం మావోలు కనుసన్నల్లో ఉంటుంది.. వారికి తెలియకుండా అక్కడ ఏమీ జరగదు... అక్కడ వారి అనుమతి లేకుండా ఒక్క పురుగు కూడా లోపలికి ప్రవేశించదు.. అలాంటి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం రాగానే ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం.. బీఎస్ఎఫ్, డీఆర్జీ సహా 200 మంది భద్రతా సిబ్బందితో అతి కష్టమ్మీద అక్కడికి చేరుకున్నాం.. మంగళవారం ఉదయం మావోయిస్టులపై మెరుపుదాడికి ప్రయత్నించినప్పుడు.. దళ సభ్యుడు ఒకరు బాంబులు పేల్చి అగ్రనాయకులను అప్రమత్తం చేశాడు.
దీంతో మేం కొన్ని గంటలపాటు అక్కడే దాక్కోవాల్సి వచ్చింది.. ఎటువంటి ప్రమాదం లేదనే భావనకు మావోయిస్ట్‌లు వచ్చేవరకూ అత్యంత వేడి, ఉక్కుబోతను తట్టుకుని మెల్లగా అడుగులు వేశాం.. వారి క్యాంపునకు 300 మీటర్ల దగ్గరకు చేరుకున్న తర్వాత మా కదలికలను పసిగట్టకుండా ఉండేందుకు పాకుతూ వెళ్లాం.. వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేశాం.. అయినా మా రాకను గమనించిన మావోలు కాల్పులు ప్రారంభించారు.. తొలుత బుల్లెట్ బీఎస్ఎఫ్ జవాన్‌కు తగిలింది.. తర్వాత మరో ఇద్దరు గాయపడ్డారు.. మేం ఎదురుకాల్పులకు దిగాం’ అని ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ వివరించారు. కాంకేక్ ఎస్పీ కళ్యాణ్ ఎలెసెలా మాట్లాడుతూ.. 29 మంది మావోయిస్ట్‌లకు మట్టుబెట్టిన ఆపరేషన్‌కు లక్ష్మణ్ కేవాత్ వ్యూహకర్త, నాయకత్వం వహించారని అన్నారు.
అనేక ఎన్‌కౌంటర్ల అనుభవజ్ఞుడైన కేవత్ మాట్లాడుతూ.. దెబ్బలు తగిలిన తర్వాత పడిపోయిన జవాన్ల ముఖాలు తన కళ్లలో మెరిశాయని, అయితే నొప్పిని భరిస్తూ తుపాకిపై దృష్టి సారించి ఎదురుకాల్పులు జరిపారని చెప్పాడు. ప్రతి బుల్లెట్ మావోయిస్టులకు తగలాలని నేను ప్రార్థించానని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎంతమందిని కాల్చిచంపారని అడిగిన ప్రశ్నకు కేవత్ సమాధానం ఇస్తూ.. ‘నేను ఇకపై మావోయిస్టుల మృతదేహాలను లెక్కించను... నేను పెద్ద సంఖ్యపై దృష్టి సారించాలని భావిస్తున్నాను’ అని తెలిపారు.
ఇక, 39 ఏళ్ల లక్ష్మణ్ కేవత్ ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖలో 2007లో కానిస్టేబుల్‌గా చేరారు. తన పనితీరుతో ఐదేళ్లకే ఎస్ఐగా ప్రమోషన్ పొంది.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం పఖంజూర్ పోలీసుస్టేషన్ ఇన్‌ఛార్జిగా, డీఆర్‌జీ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న లక్ష్మణ్.. తాజా కాంకేర్ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. తన సర్వీసులో 44 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు.