ఇరాన్‌పై ఇజ్రాయేల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా పరిస్థితి మరింత వేడెక్కింది. గతవారం ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్న ఇజ్రాయేల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై దాడికి దిగింది. ఇరాన్ సుప్రీం అధినేత అయాతుల్లా అలీ ఖొమేనీ పుట్టిన రోజునే దాడికి ఇజ్రాయేల్ ఎంచుకోవడం గమనార్హం. ఇరాన్ అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రం ఇస్ఫహాన్ నగరంపై డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులను ప్రయోగించింది. కాగా, ఈ దాడిపై వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తోన్న భారత్.. పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. అయితే, ఇజ్రాయేల్, ఇరాన్‌లోని భారతీయ పౌరులను అక్కడ నుంచి వీడాలని కోరుతుందా? అనేది మరింత తీవ్రతరం అవుతుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పరిస్థితి విషమిస్తే ఇరు దేశాల్లోని భారతీయులను సురక్షితంగా తరలించడమే కేంద్రం మొదటి ప్రాధాన్యత.
గతవారం ట్రావెల్ అడ్వైజరీ జారీచేసిన భారత్.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఇరాన్, ఇజ్రాయేల్‌లో పర్యటించవద్దని సూచించింది. అలాగే, అక్కడ ఉండే భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించింది. ‘అన్ని ఎంపికలు టేబుల్‌పై ఉన్నాయి... అయితే ప్రస్తుతానికి వేచి, చూసే విధానంలో ఉంది’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేలాది నిర్మాణ కార్మికులు ఇజ్రాయేల్‌కు వెళ్లడానికి అనుమతించే ప్రతిపాదనను భారత్ ఇంతకుముందు నిలిపివేసింది. గతేడాది మేలో ఇరు దేశాల సంతకం చేసిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. తీవ్రమైన కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయేల్‌కు 42 వేల మందిని భారత్ పంపాల్సి ఉంది.
మరోవైపు, ఇజ్రాయేల్ దాడిలో ఇరాన్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ఇజ్రాయెల్ దాడిని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. దీనిపై ఇజ్రాయేల్ అధికారికంగా స్పందించకపోగా.. ఇరాన్ కూడా మౌనం వహించడం విశేషం. ఇజ్రాయేల్ ప్రతీకార దాడి నేపథ్యంలో అమెరికా తమ దౌత్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. అలాగే, తక్షణమే ఇరాన్, ఇజ్రాయేల్‌లను వీడాలని, సైనిక చర్యలు, ఉగ్రదాడుల ముప్పు ఉందని ఆస్ట్రేలియా తన పౌరులకు సూచించింది.
ఏప్రిల్ 13న 300లపైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయేల్‌పై విరుచుకుపడింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై బెంజిమిన్ నెతన్యాహు భారీగా విరుచుకుపడతారని అందరూ భావించారు. కానీ పరిమిత స్థాయిలోనే క్షిపణులు, డ్రోన్లను ఇజ్రాయెల్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా, సైనికపరంగా ఇరాన్‌కు ఇస్ఫహాన్ ప్రావిన్సులు అత్యంత కీలక ప్రాంతం. పలు సైనిక స్థావరాలు, పరిశోధన కేంద్రాలు, అణుకేంద్రాలతో పాటు ఇరాన్ ప్రధాన వైమానిక స్థావరం ఇక్కడే ఉంది. అణుశుద్ధి కేంద్రం ఉన్న నతాంజ్ నగరమూ ఇస్ఫహాన్‌కు సమీపంలోనే ఉంది. భారీ సంఖ్యలో డ్రోన్, బాలిస్టిక్ క్షిపణుల తయారీ కర్మాగారాలూ ఉండటంతో అందుకే ఈ నగరాన్ని ఇజ్రాయేల్ లక్ష్యంగా చేసుకుంది.