చైనా కుంగిపోతోంది. అదేంటి చైనా కుంగిపోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా. ఆ దేశంలో భారీగా పెరిగిన పట్టణీకరణ కారణంగా భూమి కుంగిపోతోంది. చైనాలోని ప్రధాన నగరాలు క్రమంగా భూమిలోకి కుంగిపోతున్నాయని తాజాగా ఓ శాటిలైట్ డేటా సంచలన విషయాన్ని బయట పెట్టింది. గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతున్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో ఉన్న నగర జనాభాలో దాదాపుగా మూడింట ఒక వంతు మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక 2120 నాటికి చైనాలోని పట్టణ జనాభా 3 రెట్లు పెరుగుతుందని.. ఈ భూమి కుంగిపోవడం వల్ల 5.5 కోట్ల నుంచి 12.8 కోట్ల మంది చైనా ప్రజలపై ప్రభావం పడుతుందని తీవ్ర హెచ్చరికలు చేశారు.
బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేసింది. శాటిలైట్ డేటాను పరిశీలించిన ఆ పరిశోధన బృందం దాదాపు 70 కోట్ల మంది జనాభా ఉన్న షాంఘై, బీజింగ్ సహా 82 నగరాలపై అధ్యయనం చేసింది. చైనాలోని పట్టణ భూభాగంలో 45 శాతం కుంగిపోతుందని తెలిపారు. 16 శాతం సంవత్సరానికి 10 మిల్లిమీటర్ల చొప్పున భూమి కిందికి కుంగిపోతున్నట్లు గుర్తించారు. ఇక ఈ కుంగుబాటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చైనా రాజధాని బీజింగ్.. తీరప్రాంత నగరం టియాంజిన్ ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
దాదాపుగా 7 కోట్ల మంది జనాభా ఏడాదికి 10 మిల్లీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వేగంగా భూమి కుంగుబాటును ఎదుర్కొంటున్నారని శాస్త్రవేత్తలు సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. నగరాల్లో పెరుగుతున్న కార్యకలాపాల కారణంగానే భూమి కుంగిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా నగరాల్లో భారీగా నిర్మాణాలు, భవనాలు నిర్మించడం.. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల.. భూమి కుంగిపోవడం వేగవంతం అవువతోందని తెలిపారు. ఈ భూమి కుంగిపోవడం అనేది టియాంజిన్‌తో సహా తీర ప్రాంత నగరాలపై ఎక్కువ ప్రభావం ఉందని వారి పరిశోధనల్లో వెల్లడైంది.
భూమి క్షీణించడం, సముద్రమట్టాలు పెరగడం వల్ల 2120 నాటకి 5.5 కోట్ల నుంచి 12.8 కోట్ల మంది పట్టణ వాసులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో తేల్చారు. ఇక చైనాలోనే అతిపెద్ద నగరంగా పేరు గాంచిన షాంఘై నగరం.. గత వందేళ్లలో 3 మీటర్ల మేర కుంగినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటికే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు భూమి కుంగిపోవడం అనే వార్త మింగుడుపడటం లేదు.