చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కొత్త విభాగం చేరింది. సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఇనఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్‌ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి.. ఆధునిక యుద్ధ విధానాల్లో ఇది వ్యూహాత్మకంగానే కాకుండా కీలక స్తంభంగా నిలవనుందని తెలిపారు. చైనా సైన్యం అత్యున్నత కమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) చీఫ్‌గా చైనా... అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధినేతగా జిన్‌పింగే వ్యవహరిస్తున్నారు.
ఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటుచేయాలన్న నిర్ణయాన్ని శక్తివంతమైన సైన్యాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీసీ, సీఎంసీలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ,సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు 2015లో ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)కు ఆధునిక రూపమే ఐఎస్‌ఎఫ్ అని పరిశీలకులు భావిస్తున్నారు. పీఎల్ఏ స్పేస్ ఫోర్స్, సైబర్‌స్పేస్ ఫోర్స్ నాయకత్వం, నిర్మాణాలు తదనుగుణంగా పునర్వ్యవస్థీకరించినట్టు సీఎంసీ తెలిపింది. తాజా ప్రకటనతో స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్‌లో కీలకమైనవిగా చెప్పుకునే స్పేస్ ఫోర్స్, సైబర్‌స్పేస్ ఫోర్స్ ఉనికిని చైనా మొదటిసారిగా ధ్రువీకరించినట్టు అధికారిక మీడియా జున్హు నివేదించింది.
‘ఇది జాతీయ రక్షణ, సాయుధ బలగాల ఆధునీకరణకు, ఆధునిక యుగంలో సైన్యం తన మిషన్లు, విధులను నెరవేర్చడానికి లోతైన, విస్తృత ప్రాముఖ్యత కలిగి ఉంది.. "ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అనేది పీఎల్ఏ సరికొత్త వ్యూహాత్మక విభాగం.. నెట్‌వర్క్ సమాచార వ్యవస్థ సమగ్ర అభివృద్ధి, వినియోగానికి కీలక స్తంభం’ అని ఆయన చెప్పారు. పీఎల్ఏ ఆధునిక యుద్ధంలో పోరాడి గెలిచే సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.. గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, సీనియర్ కల్నల్ వు కియాన్ మీడియాతో మాట్లాడుతూ.. తాజా విభాగంతో కలిసి పీఎల్ఏ ఇప్పుడు నాలుగు సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రౌండ్ ఫోర్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్‌లో ఉప శాఖలు స్పేస్ ఫోర్స్, సైబర్ స్పేస్ ఫోర్స్, ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్, జాయింట్ లాజిస్టిక్ సపోర్ట్ ఫోర్స్ అని తెలిపారు.
అంతరిక్షానికి ప్రయాణించే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, వనరులను అభివృద్ధి చేయడం, సంక్షోభ నిర్వహణను మెరుగుపరచడంలో ఈ దళాన్ని నిర్మించడంలో ముఖ్య ఉద్దేశ్యమని వు చెప్పారు. ‘చైనా అంతరిక్ష విధానాలు స్పష్టంగా ఉన్నాయి. అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకోవడానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాం.. ఎక్స్ఛేంజీలను బలోపేతం చేయడానికి, సహకారాన్ని మరింతగా పెంచడానికి, అంతరిక్షంలో శాశ్వత శాంతి, ఉమ్మడి భద్రతకు దోహదపడేందుకు ఒకే నిబద్ధతతో అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు.