విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో రైల్వే జోన్ కొండపల్లి-మోటుమర్రి సెక్షన్ విజయవాడ డివిజన్ లో విలీనం.ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్ట్) రైల్వే జోన్ ఏర్పాటును భారత రైల్వే శాఖ ఖరారు చేసింది. విశాఖ రైల్వే డివిజన్ ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ ను విశాఖ డివిజన్ గా మారుస్తారు. విశాఖ డివిజన్ తో పాటు రాష్ట్రంలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ కోస్తా జోన్ లో ఉండనున్నాయి. అంతేకాదు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి సెక్షన్ ను విజయవాడ డివిజన్ లో విలీనం చేయనున్నారు. విజయవాడ శివార్లలోని కొండపల్లి ప్రాంతం సికింద్రాబాద్ డివిజన్ లో భాగంగా ఉంది. ఇకపై ఈ సెక్షన్ ను విజయవాడ డివిజన్లో భాగంగా పరిగణిస్తారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను మొత్తం 410 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త ప్రత్యేక జోన్ ఏర్పాటుతో ఏపీలో రైల్వే సేవలు మరింత మెరుగు పడనున్నాయి. ప్రాంతీయ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తయారు చేయనున్నారు.