ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 70 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుండగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. ఢిల్లీలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందనే ఉత్కంఠకు తెరపడాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. 8వ తేదీన ఓట్ల లెక్కింపుతో అసలు ఫలితాలు వెలువడతాయి. అంతకంటే ముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానున్నాయి. ఢిల్లీలో ఇవాళ పోలింగ్ పూర్తైన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు పలు సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించనున్నాయి. జాతీయ స్థాయిలో అనేక సంస్థలు తమ అంచనాలను విడుదల చేయనున్న క్రమంలో కొన్ని సంస్థల సర్వేలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కచ్చితమైన ఫలితాలు ఇవ్వడంతో పాటు.. మహారాష్ట్ర ఫలితాలను సరిగ్గా అంచనావేసిన కేకే సర్వే ఢిల్లీ ఫలితాలపై ఎలాంటి అంచనాలను వెల్లడించబోతున్నారనేది ఆసక్తి నెలకొంది.