ఛాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని వంటి విదేశీ AI యాప్‌ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ పనిని సులభంగా, వేగంగా పూర్తిచేయడానికి ఈ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించి అందరి మదిలో అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏఐ యాప్స్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్‌ను తప్పక అనుమతించాల్సిందే. ఇది ఏఐ టెక్నాలజీ యాప్స్ వాడేవారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. జాతీయ భద్రత, సున్నితమైన, గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే తమ ఉద్యోగులు ఛాట్ జీపీటీ, డీప్ సీక్ ఇక మీదట వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థికశాఖ.