కేంద్ర బడ్జెట్ 2025లో ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.9000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రాజమండ్రి, తిరుపతి సహా ప్రధాన నగరాల్లోని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని 73 రైల్వేస్టేషన్లు ఆధునీకరించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య, కడప, కర్నూలు జిల్లాల్లోని పలు రైల్వేస్టేషన్లకు మహర్దశ పట్టనుంది. రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్లను ఆధునీకరించి.. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ అమృత్ భారత్ స్టేషన్ పథకం తీసుకువచ్చింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కడప, మదనపల్లె రోడ్, పీలేరు, రాజంపేట రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలో 73 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనుండగా.. వీటిల్లో ఇవి కూడా స్థానం సంపాదించుకున్నాయి. కడప రైల్వేస్టేషన్లో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా మరిన్ని నిధులు కేటాయించనుండటంతో.. రైల్వేస్టేషన్లను అత్యాధునిక ఆర్కిటెక్చర్, అంతర్జాయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. మరోవైపు కర్నూలు జిల్లాలోనూ పలు స్టేషన్లను అమృత్‌భారత్ స్టేషన్ కింద ఆధునికీకరించనున్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, డోన్, ఆదోని, నంద్యాల రైల్వేస్టేషన్లను అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేశారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపికైన రైల్వేస్టేషన్లలో పలు అభివృద్ధి పనులు చేపడతారు. రైల్వేస్టేషన్ ప్రవేశ ద్వారాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. అలాగే రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించే రోడ్ల వెడల్పు, సైన్ బోర్డులు ఏర్పాటు, వాహనాలకు పార్కింగ్ సదుపాయం, ప్రయాణికుల కోసం ప్రత్యేక ట్రాకులు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు తెలియపరిచేలా స్టాళ్లు, చిత్రాల ఏర్పాటు చేస్తారు. రైల్వే ప్రయాణికుల రాకపోకలకు సులభంగా ఉండేలా.. స్టేషన్ ముందు భాగాన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే ఒకటో ప్లాట్‌ఫాం నుంచి ఇతర ప్లాట్‌ఫాంలకు వెళ్లడానికి వీలుగా లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అదనపు వెయిటింగ్ హాళ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రయాణికుల కోసం స్టేషన్ల వద్ద షెల్టర్లు ఏర్పాటు చేస్తారని రైల్వే అధికారులు వివరించారు.