ఏపీ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యాచరణలు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను రాజ్ నాథ్ సింగ్‌కి వివరించారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపికి వచ్చేలా సహకరించాలని కోరారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్‌కి తెలిపారు.ఈ భేటీకి టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ, లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు మరి కొందరు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో మంత్రి లోకేష్, గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు అంశాలను కూడా ప్రస్తావించారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను దశలవారీగా ముందుకు తీసుకువెళ్తుందన్నారు. గత ప్రభుత్వ హైడ్రోజన్ విధానాల వల్ల రాష్ట్రం రూ. 10 లక్షల కోట్ల అప్పులలో చిక్కుకుపోయిందన్నారు.కానీ ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఆక్సిజన్ అందిస్తోందని లోకేష్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం సహకారాన్ని అందిస్తున్నందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరించారు. ఈ భేటీ అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన సహాయాన్ని ఇస్తామని లోకేష్‌కు హామీ ఇచ్చారు.