ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. పట్టపగలే ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ నుంచి రూ.66 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఆ సొత్తును మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు. గురువారం ఒంగోలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఈ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దోపిడీ వెనుక సీఎంఎస్ మాజీ ఉద్యోగితో పాటు ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ హస్తం ఉన్నట్టు గుర్తించారు. సీఎంఎస్ మాజీ ఉద్యోగి సన్నమూరు మహేష్‌బాబు (22), రాచర్ల రాజశేఖర్ (19), ఒంగోలు సీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ గుజ్జుల వెంకట కొండారెడ్డి (40)లు దోపిడీకి ప్లాన్ చేసినట్టు తేలింది. ఎత్తుకెళ్లిన సొమ్మును ఎక్కడ దాచిపెట్టాలో తెలియక.. చివరకు మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు.
చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నింపడానికి గురువారం మధ్యాహ్నం రూ.68 లక్షల నగదుతో ఒంగోలు నుంచి సీఎంఎస్ సెక్యూరిటీ కంపెనీ సిబ్బంది బయలుదేరినట్టు ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ అనీల్ తెలిపారు. ఈ క్రమంలో కర్నూలు రోడ్డులోని వర్మ హోటల్ దగ్గర వాహనం ఆపి భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి వ్యాన్ తలుపులు తెరిచి ఉండగా.. అందులో రూ.66 లక్షల చోరీ జరిగినట్లు గుర్తించారు. కేవలం రూ.100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. సాంకేతికత ఆధారంగా చోరులను గుర్తించారు. సీఎంఎస్ మాజీ ఉద్యోగి మహేష్ బాబును పేర్నమిట్టలో పట్టుకుని విచారించారు. దీంతో ఎత్తుకెళ్లిన డబ్బును మర్రి చెట్టు కుహరంలో దాచినట్టు వెల్లడించారు. ఈ దోపిడీకి సహకరించిన రాజశేఖర్, కొండారెడ్డి అరెస్టు చేశారు.