ఎన్నికల వేళ రాజకీయ నేతల ఆస్తులు, అప్పులు, కేసుల గురించే తీవ్ర చర్చ జరుగుతోంది. నామినేషన్ సమయంలో తప్పనిసరిగా తమ ఆస్తులు, కేసుల వివరాలతో కూడిన అఫిడ్‌విట్‌ను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేతల ఆస్తుల చిట్టా అధికారంగా బహిర్గతమవుతోంది. ఈ నేపథ్యంలో నగరి నుంచి మరోసారి పోటీచేస్తోన్న మంత్రి ఆర్కే రోజా.. ఏప్రిల్ 19న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడ్‌విట్ దాఖలు చేయగా. . అందులో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.
రోజా అఫిడ్‌విట్
తనకు రూ.4.58 కోట్ల చరాస్తులు, రూ.6.05 కోట్ల స్ధిరాస్తులు, తన పేరున తొమ్మిది కార్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. దీంతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో తనకు ఓ చిట్ ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. మార్గదర్శి చిట్ ఫండ్‌లో ఎల్టీ0330వీ ఎంఏ/48 నంబరుతో రూ.39.21 లక్షల విలువైన చిట్ ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, మరో ప్రయివేట్ చిట్స్‌లో తనకు రూ.32.90 లక్షల చిట్ ఉన్నట్లు తెలిపారు. అయితే ఇందులో ఎలాంటి వివాదం లేకపోయినా గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మార్దదర్శి చిట్స్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పలు కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది.
అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మార్గదర్శిపై ఆరోపణలు చేశారు. ఇలాంటి తరుణంలో ఆ సంస్థలోనే రోజా ఇంకా చిట్ కొనసాగిస్తుండటం గమనార్హం. కాగా, మార్గదర్శి చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తోందని అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్లడంతో అనేక మలుపులు తిరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు కోర్టులో ఉంది. ఇదే సమయంలో జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేర విచారణ విభాగం (సీఐడీ) మార్గదర్శిపై మరో కేసు పెట్టి విచారణ చేస్తోంది. 2022 అక్టోబరు, నవంబరు నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రంలోని వివిధ మార్గదర్శి ఆఫీసుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి,పెద్దఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచీ నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది.