ఒంటిమిట్టలో కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మోహిని అలంకారంలో కోదండ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు. భాజా భజంత్రీలు,కేరళ డప్పు వాయిద్యాలు మధ్య నేత్రపర్వంగా పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి, ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో కీలకమైన స్వామివారి కళ్యాణం సోమవారం రాత్రి జరగనుంది. కోదండ రామస్వామి కళ్యాణోత్సవం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పౌర్ణమి రాత్రి పండు వెన్నెల్లో ఒంటిమిట్ట రాముల వారికి కళ్యాణం జరగడం ప్రత్యేకత.
సోమవారం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు నిండు పున్నమి వెలుగుల్లో వైభవంగా సీతారాముల కళ్యాణం జరగనుంది. కళ్యాణోత్సవం కారణంగా ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కడప-రేణిగుంట వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లింపు ఉంటుంది. భక్తుల పార్కింగ్ కోసం 15 చోట్ల ఏర్పాట్లు చేశారు. ఇక, ఒంటిమిట్ట కోందడరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 25 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వాహన సేవలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న సోమవారం కళ్యాణోత్సవం, 23న రథోత్సవం ,25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నాయి. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు వేసి, తాగునీరు అందుబాటులో ఉంచారు. భక్తులకు తీర్థప్రసాదాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.