అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాలో తెలుగుదేశం పార్టీ మరోసారి మార్పులు చేసింది. ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కొత్త వారికి బీఫామ్‌లు అందజేశారు. గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగానే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు దక్కింది. ఉండితో పాటుగా మాడుగుల, పాడేరు, వెంకటగిరి, మడకశిర స్థానాలలో టీడీపీ అభ్యర్థులను మార్చింది. ఉండి అభ్యర్థిగా గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు చంద్రబాబు మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే నరసాపురం ఎంపీ రఘురామ ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా రఘురామను పోటీ చేయించాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ.. ఉండి టికెట్‌ను ఆయనకు కేటాయించింది.
అలాగే రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును.. నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ నియమించింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని ఈసారి మాడుగుల నుంచి బరిలో నిలుపుతున్నారు. పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. జనసేన తరుఫున పంచకర్ల రమేష్ బాబు అక్కడి నుంచి పోటీలో ఉన్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వకపోవటంతో బండారు అసంతృప్తికి గురయ్యారు. ఈ ఆవేదనతో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మాడుగుల నుంచి బండారును బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు. మాడుగుల టికెట్‌ను తొలుత పైలా ప్రసాద్‌కు కేటాయించగా.. తాజాగా ఆయన స్థానంలో బండారుకు అవకాశం ఇచ్చారు. ఇక పాడేరు అసెంబ్లీ అభ్యర్థిని సైతం చంద్రబాబు మార్చారు. గతంలో ఈ సీటును వెంకట రమేష్ నాయుడుకు కేటాయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వర్గం భగ్గుమంది. నియోజకవర్గంపై గిడ్డి ఈశ్వరికి గట్టి పట్టు ఉండటంతో అధిష్టానం మళ్లీ ఆమెకే అవకాశం ఇచ్చింది.
అనంతపురం జిల్లా మడకశిర అభ్యర్థిని సైతం చంద్రబాబు మార్చారు. సునీల్ కుమార్ స్థానంలో.. ఎం.ఎస్, రాజుకు అవకాశం ఇచ్చారు. సునీల్ కుమార్‌కు టికెట్ ఇవ్వటంపై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఎమ్మెస్ రాజును బరిలోకి నిలిపారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తెను ఇదివరకు ప్రకటించారు. తాజాగా కుమార్తెను కాకుండా రామకృష్ణనే బరిలో నిలపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.