బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో అలజడి రేగింది. జఫ్లాంగ్ సరిహద్దు వద్ద భారతీయ పర్యాటకులపై బంగ్లా పౌరులు రాళ్లు రువ్వారు. పర్యాటకులు నదిలోకి దిగి సేద తీరుతుండగా ఉన్నట్టుండి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన భారతీయులు.. నదిలో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్, బంగ్లా సరిహద్దుల్లోని జఫ్లాంగ్ ప్రాంతం ఇరు దేశాలకు ప్రముఖ పర్యాటక ప్రాంతం. అక్కడ సేదదీరేందుకు నిత్యం పర్యాటకుల పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అక్కడికి వెళ్లేందుకు వీసా అవసరం కూడా లేకపోవడంతో రెండు దేశాల పర్యాటకులు ఆసక్తి చూపుతారు.
భారతీయ పర్యాటకులు నదిలోకి దిగి సరదగా గడుపుతున్న సమయంలో రాళ్ల దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. తొలుత భారతీయ యువకులతో గొడవపడిన బంగ్లాదేశ్ టూరిస్ట్‌లు.. రాళ్లు విసరడం ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ఐదుగురు ఆకతాయిలు మీకు ప్రవేశం లేదు ఎందుకు వస్తున్నారని భారతీయులను అడ్డుకున్నారు. దీనిని భారత యువకులు ప్రతిఘటించి... ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఈ క్రమంలో మరికొందరు బంగ్లాదేశ్ టూరిస్టులు అక్కడికి వచ్చి గొడవకు దిగారు దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది.
భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బంగ్లాదేశ్ టూరిస్టులు రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. భారతీయ టూరిస్టులు అక్కడి నుంచి వెళ్లే వరకు అదే పనిగా రాళ్లు విసిరారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన పర్యాటకులు. రాళ్లు విసరడం ఏంటని మండిపడ్డారు. కనీస భద్రత లేకుండా పోతోందని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని, దాడికి దిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.