ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పవన్ కల్యాణ్, చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. తాజాగా కొందరు జనసేన కీలక నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైయస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు. కాగా, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను జనసేన నేతలు, టీడీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. అధికార పార్టీలో చేరిన వారిలో జనసేన పార్టీ సీనియర్ నేత గంపల గిరిధర్, ఎన్. శ్రీనివాస్, జి.శ్రీజ, జి. ధనుష్. విద్యావేత్త అలీవర్ రాజు రాయ్ ఉన్నారు. వీరిందరికీ సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి వైయస్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు. ఇక, 2019లో జనసేన పార్టీ తరపున విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి గంపల గిరిధర్ పోటీ చేశారు. మరోవైపు.. భీమిలి నియోజకవర్గానికి చెందిన జనసేన నేత, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అండ్ టీఎస్ఎఫ్‌సీఆర్‌ఏ ఎన్‌జీఓస్ చైర్మన్, విద్యావేత్త అలీవర్ రాజు రాయ్ కూడా వైయస్ఆర్‌సీపీలో చేరారు. అలాగే, శంకర్ పౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణ కుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్ డి.భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్‌లు, కిరణ్మయి, దాసు కూడా వైయస్ఆర్‌సీపీలో చేరారు.