శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం అల్లివలసలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక మహిళ మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అల్లివలస గ్రామంలో మైలిపిల్లి లక్ష్ముడు కుమారుడికి ఆదివారం రాత్రి పెళ్లి నిశ్చయించారు. ఈ మేరకు వధూవరులను పీటలపై కూర్చోబెట్టిన తర్వాత తంతులన్నీ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధు వులు వివాహ వేడుకల్లో నిమగ్నమయ్యారు. అయితే మరో పది నిమిషాల్లో పెళ్లికొడుకు తాళి కడతాడన్న సమయానికి పురోహితుడు పట్టుకున్న మైక్‌కు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో అక్కడే ఉన్న పెళ్లి కుమారుడు బంధువు జీడిపాలెంకు చెందిన సీతమ్మ(48) షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పురోహితుడు వెంకట రమణతో పాటు పెళ్లి కుమారుడు తండ్రి లక్ష్ముడు, సూరాడ రవణమ్మ, ఎం. రేవంత్, ఎం. లక్ష్మి, ఎస్.చిల కమ్మ, జి. ఎల్లమ్మ, జి.లక్ష్మి మరికొందరు విద్యుదాఘాతానికి గురయ్యారు. వారిని హుటా హుటిన ఆటోల్లో రణస్థలం లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తు న్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమా చారం. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.