ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్నా నన్ను క్షమించు.. మా అక్కకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నా: భరత్ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 07:55 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కూటమి పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా దర్శి, పర్చూరు నియోజకవర్గాలకు సంబంధించి కీలక పరిణామాలు జరిగాయి. పర్చూరు వైఎస్సార్‌సీపీ నేత గొట్టిపాటి భరత్.. తన సోదరి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో తన అక్కకు మద్దతుగా నిలుస్తున్నట్లు భరత్ ప్రకటించారు. తనను పర్చూరు నియోజకవర్గ ప్రజలు క్షమించాలి అంటూ ఏకంగా పేపర్‌లో ఓ ప్రకటనను విడుదల చేయడం విశేషం.


'గౌరవనీయులైన పర్చూరు నియోజకవర్గ ప్రజానికానికి, కార్యకర్తలకు మరియు నాయకులకు నా నమస్కారాలు . నా తండ్రి గొట్టిపాటి నరసింహారావు మరణాంతరం నాకు జగనన్న పర్చూరు ఇన్చార్జిగా ప్రకటించినప్పటి నుంచి, నా ప్రయాణం మీతోనే సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోవడం జరిగింది దాని తరువాత ఐదేళ్ల పోరాటంలో నాతో ఎన్నో కేసులు, అవమానాలు పడ్డారు, నా సుఖాల్లోకంటే నా కష్టాల్లోనే నాకు తోడు నీడగా నిలిచారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇంఛార్జ్‌ల మార్పులవల్ల వచ్చిన కొత్తవారికి సమన్వయ లోపం వల్ల కష్టపడే నాయకులకి అసలైన YSRCP కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయాను నన్ను క్షమించాలి'అని కోరారు.


'2014 సార్వత్రిక ఎన్నికల్లో నా కష్టం, నా త్యాగం మీ అందరికీ తెలిసిందే, నా కష్టంలో నా అక్క నాకు తోడుగా నిలిచింది. నేను 150 ఎకరాలు అమ్మినా ఏంటి, ఎందుకు అని అడక్కుండా సంతకం పెట్టింది. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టినా నన్ను ఏనాడు ప్రశ్నించలేదు. మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ, పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్ళినా, నామ మాత్రపు ఫీజు తీసుకుని వైద్యం చేసింది. ఇప్పటివరకు నా అక్క నన్ను ఏమి అడగలేదు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు తోడుగా నిలబడు అని అడిగింది. నా అక్కకి తోడుగా నిలబడటం నా ధర్మంగా భావించి దర్శికి వెళ్తున్నాను. జగనన్న నన్ను క్షమించండి నాకు మీరు ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపించారు, కానీ నా ధర్మం నేను నిర్వర్తించి నా వంతుగా నేను నా అక్కకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను'అంటూ ప్రకటన విడుదల చేశారు.


గొట్టిపాటి భరత్ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడు. నరసయ్య గతంలో టీడీపీలో ఉండగా.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరగా.. పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు 2013లో నరసయ్య కన్నుమూయగా.. భరత్‌ను పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. 2014 ఎన్నికల్లో భరత్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయితే ఇటీవల భరత్ సోదరి లక్ష్మికి టీడీపీ టికెట్ ప్రకటించడంతో.. ఆయన అడుగులు ఎటు వైపు ఉంటాయనే చర్చ జరిగింది. అయితే భరత్ తన అక్కకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa