కుక్కలు చింపిన విస్తరిలా కూటమి పరిస్థితి తయారైందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అతుకుల బొంత కంటే దారుణంగా.. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది చంద్రబాబేనని, 2014లోనూ ఇదే కూటమి హామీలిచ్చి మోసం చేసిందని అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.....చంద్రబాబు తనవారినే ఇతర పార్టీలోకి పంపిస్తున్నారు. టీడీపీ వాళ్లనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారు. భీమవరం, అవనిగడ్డలో ఇదే జరిగింది. ఇప్పుడు అనపర్తిలోనూ అదే జరుగుతోంది. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతను బీజేపీలోకి పంపి.. ఆయనకు ఇప్పుడు ఇప్పిస్తున్నారు. పార్టీ టికెట్లు ఇచ్చినట్లే ఇచ్చి.. తమవారినే అభ్యర్థులుగా ప్రకటిస్తే ఏం లాభం?. పవన్‌కు కనీసం రెండేళ్లైనా సీఎం పదవి ఇవ్వాలన్నదే జనసైనికుల కోరిక. కానీ, చంద్రబాబు పవన్‌కు 24 సీట్లే ఇచ్చారు. ఆపైనా కోత వేశారు. ఆఖరికి చంద్రబాబు జనసేనను 21 సీట్లకు పరిమితం చేశారు. జనసేనలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో పది నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లే. అంటే.. పవన్ తమ వారికి 10 సీట్లు మాత్రమే ఇప్పించుకోగలిగారు. వీటిల్లో కూడా ఇంకా తగ్గించొచ్చు. పిఠాపురం నుండి పవన్ కూడా పోటీ నుండి తప్పుకోవచ్చు. రాష్ట్రమంతా ప్రచారం చేయాలనే సాకు చూపించి పవన్ బరిలో నుండి వెళ్లిపోయే అవకాశం లేకపోలేదు. మొత్తం సీట్లు తన పట్టులో ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. పిఠాపురంలో సైతం పవన్‌ను తప్పించి వర్మను దించుతారేమో. ఎన్నికలను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీతో మరోవైపు కాంగ్రెస్‌తో జత కట్టారు. చంద్రబాబుని చూసి ఎవరూ ఓట్లేయరు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇదే కూటమి ప్రజల్లోకి అప్పుడు వెళ్లింది. అందుకే ప్రజల్లోకి వెళ్లేందుకు మొహం చెల్లడం లేదు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎలా ఉండాలో చేసి చూపించాం. అవినీతికి ఆస్కారం లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. అందుకే మేం ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా అర్హత కోల్పోయింది. చంద్రబాబు జనంలో నుండి వచ్చిన నాయకుడు కాదు. ఆయన పార్టీని కబ్జా చేసి వచ్చారు. అందుకే ఆయనకు ప్రజల గురించి ఏమీ తెలియదు. లాస్ట్ ఛాన్స్ కూడా జారిపోతుందని చంద్రబాబుకు అర్థం అయింది. అందుకే అందర్నీ తిడుతూ తిరుగుతున్నారు. చంద్రబాబు కుట్రలపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆఖరి ప్రయత్నంగా డబ్బులు కుమ్మరించి అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ఎన్.ఆర్.ఐ. విభాగం డబ్బు మూటలు వెదజల్లుతోంది అని అన్నారు.