రాష్ట్రంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా హింసాత్మక సంఘటనలు జరగడంతో ఏపీని సమస్యాత్మక (సెన్సిటివ్) రాష్ట్రంగా ఈసీఐ చూస్తోందన్నారు. ఈ కారణంగానే రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పోలీస్ పరిశీలకుడిని నియమించిందని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘రాష్ట్రం నుంచి ఫిర్యాదులు కేంద్రఎన్నికల సంఘానికి ఎక్కువగా వెళ్లాయి. ఇంతముందు ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు వచ్చాయి. హింసాత్మక సంఘటనలు, ఓటర్లకు నగదు పంపిణీ, తాయిలాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం...మొదటిసారి రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను పంపించింది. రాష్ట్రానికి వచ్చి అన్ని శాఖల అధికారులతో వీరు సమీక్షలు నిర్వహించారు. అనంతరం వారు ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక పరిశీలకులతోపాటు 25 పార్లమెంటు స్థానాలకు 25 మంది ప్రత్యేక పోలీస్ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. రాష్టంలో రోజూ హింస చెలరేగడంపైనా కేంద్ర ఎన్నికల సంఘం నిఘా ఉంది. ఇప్పటికే ఆరుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేసింది. కోడ్ అమల్లో ఉండగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై ముగ్గురు ఎస్పీలను పిలిచి మాట్లాడాను. వారి వివరాలను ఈసీఐకి పంపగా, వారిలో ఇద్దరిని బదిలీ చేశారు. హింసరహిత ఎన్నికలు ఈసీ లక్ష్యం. ఈ విషయంలో పోలీసులదే ప్రధాన బాధ్యత. జిల్లాల స్థాయిలో ప్రతి అంశానికీ కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత’’ అని తెలిపారు.