తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జులై నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఇవాళ వర్చువల్ సేవల కోటా విడుదల చేయనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలతో పాటుగా వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను నేడు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జులై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా కూడా అందుబాటులోకి రానుంది.
మరోవైపు ఏప్రిల్ 24న ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటా విడుదల చేయనుంది టీటీడీ.. ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఏప్రిల్ 24 మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే తిరుమల శ్రీవారి సేవ కోటాను ఏప్రిల్ 27న ఉదయం 11 గంటలకు.. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జులైలో తిరుమల వెళ్లాలని భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
ఏప్రిల్ 22 సా.6 30 నుంచి 8:30 మధ్య వైభవంగా సీతారాముల కళ్యాణం
ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. సీతారాముల కళ్యాణ వేదికను జేఈవో వీరబ్రహ్మం జిల్లా జేసీ గణేష్ కుమార్, ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. శ్రీ సీతారాముల కళ్యాణం సోమవారం సాయంత్రం 6:30గం నుండి 8:30గం మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నట్లు తెలిపారు. కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో కలసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
కళ్యాణం వీక్షించే భక్తులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు గ్యాలారీల్లో నే అందించనున్నట్లు చెప్పారు. కళ్యాణ వేదికకు ఇరువైపులా దాదాపు 150 కౌంటర్లలో శ్రీవారి సేవకుల సహకారంతో అన్నప్రసాదాలు కళ్యాణం తరువాత పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్, భద్రత, సీసీ కెమెరాలు తదితర అంశాలను పరిశీలించి జేఈవో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్నప్రసాదాలు, తాగునీరు విద్యుత్, పుష్పాలంకరణలు, భద్రత, సౌండ్ సిస్టమ్, ఎల్‌ఈడీ టీవీలను టీటీడీ ఏర్పాటు చేసింది.
టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా వేదిక వద్ద బారికేడ్లు, రోప్‌లు, మెగా ఫోన్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కళ్యాణ వేదిక వద్ద శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, ఒక్కో గ్యాలరీకి వర్కర్లను నియమించింది. లక్షకు పైగా మజ్జిగ, నాలుగు లక్షలకు పైగా వాటర్ పాకెట్లను సిద్ధంగా ఉంచారు. దాదాపు 580 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు 280 మంది కార్మికులు, సూపర్‌వైజర్లు రుచికరమైన అన్నప్రసాదాలు తయారు చేయనున్నారు. ఇందులో పులిహోర, చక్కర పొంగలి ఒక్కొక్కటి 50 వేల ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు. వీటిని కల్యాణం రోజున 150 అన్నప్రసాద పంపిణీ కౌంటర్లలో భక్తులకు అందిస్తారు.
ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, 28 ఎల్ ఈడి స్క్రీన్‌లు, హై-ఫై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, గ్యాలరీలలో ఉండే భక్తులకు వేసవి ఉపశమనం కోసం 200కి పైగా ఎయిర్ కూలర్‌లు ఏర్పాటు చేశారు. కళ్యాణ వేదికను 30 వేల కట్ ఫ్లవర్‌లతో సహా నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలతో తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరిస్తున్నారు . దాదాపు 100 మంది నిపుణులు రెండు రోజులుగా పుష్పాలంకరణలు చేస్తున్నారు. కళ్యాణ వేడుకకు విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసేందుకు. టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు గ్యాలరీలకు ఇరువైపులా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించనున్నారు.