ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ యుద్ధంతో పాక్ కష్టాలు… ఇంధన వినియోగంపై పరిమితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 09:55 PM

Pakistan: ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్‌పై తీవ్రంగా పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరా నిలిచిపోవడంతో ఆ దేశం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే చమురు వినియోగంపై పలు పరిమితులు విధించింది. సాధారణంగా పాకిస్తాన్‌కు ఎక్కువగా చమురు సరఫరా అయ్యేది Strait of Hormuz మార్గం ద్వారానే. అయితే ఆ మార్గంలో చమురు రవాణాపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.తనకు మద్దతు ఇచ్చే దేశాలకు చెందిన చమురు నౌకలకే అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆ మార్గం ద్వారా పాకిస్తాన్‌కు త్వరలో చమురు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న పరిమిత చమురును జాగ్రత్తగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. దీంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు వాహనాలు ఉపయోగించాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా టెలికాం, ఐటీ కంపెనీలు వారంలో ఎక్కువ రోజులు ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇలా చేస్తే కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అలాగే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వాహనాలు వాడాల్సి వస్తే ఇతరులతో కలిసి రైడ్ షేర్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది.అదే విధంగా విద్యాసంస్థలకు కూడా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు సుమారు 25 రోజులకు మాత్రమే సరిపడతాయని సమాచారం. క్రూడ్ ఆయిల్ నిల్వలు దాదాపు 10 రోజులకు, ఎల్పీజీ నిల్వలు సుమారు 15 రోజులకు సరిపడే స్థాయిలో ఉన్నాయి. ఈలోపు Strait of Hormuz మార్గం ద్వారా తగినంత చమురు సరఫరా అందకపోతే పాకిస్తాన్ మరింత తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa