పతంజలి తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా పేపర్‌లో పతంజలి క్షమాపణలు.. ప్రకటనల సైజులో ఇచ్చారా? అని ప్రశ్నించింది. పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. తాజాగా కోర్టులో క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు. క్షమాపణలు నిన్న ఎందుకు దాఖలు చేశారని, ఇంతకు ముందే చేసి ఉండాల్సిందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో క్షమాపణల కోసం రూ. 10 లక్షల ఖర్చు చేసి, 67 వార్తా పత్రికల్లో ప్రకటన ఇచ్చామని తెలిపారు.
దీనిపై జస్టిస్ హిమ కోహ్లి స్పందిస్తూ ‘క్షమాపణ అందరికి కనిపించేలా ప్రచురించారా? మీ మునుపటి ప్రకటనల ఫాంట్, సైజు అదేనా?’ అని ప్రశ్నించారు. కంపెనీ లక్షలు ఖర్చు చేసిందని రోహత్గీ అంటే.. మాకెలాంటి ఇబ్బంది లేదు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వార్తాపత్రికలలో పెద్ద సైజులో క్షమాపణలు ప్రచురిస్తానని రామ్‌దేవ్ చెప్పడంతో ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు విచారణకు కొన్ని గంటల ముందు.. పతంజలి ఆయుర్వేద్ జాతీయ దినపత్రికలలో క్షమాపణలు ప్రకటనలు వచ్చాయి. ‘కోర్టు పట్ల తమకు చాలా గౌరవం ఉందని, తప్పులు పునరావృతం కాబోవు’ అని నొక్కి చెప్పారు. పతంజలికి వ్యతిరేకంగా కేసు వేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు రూ.1000 కోట్ల జరిమానా వేయాలని కోరుతూ పిటిషన్‌ు విచారణకు స్వీకరించినట్లు కోర్టు పేర్కొంది. ‘ఇది కుట్రపూరిత అభ్యర్థన కాదా? మేము అనుమానిస్తున్నాం’ ధర్మాసనం వ్యాఖ్యానించగా.. తన క్లయింట్‌లకు దానితో ఎటువంటి సంబంధం లేదని ముకుల్ రోహిత్గీ నొక్కిచెప్పారు.
కాగా, గతంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంతో.. స్వయంగా హాజరు కావాలని బాబా రాందేవ్, బాలకృష్టలకు జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ అమానుల్లాల ధర్మాసనం ఆదేశించింది. దీంతో కోర్టుకు హాజరైన రాందేవ్, పతంజలి ఎండీలు తమ ప్రకటనలపై చింతిస్తున్నామని, ఎవర్నీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని తెలియజేశారు అయినా, సుప్రీంకోర్టు వారి సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఏప్రిల్ 16 నాటి విచారణలో వారి వైఖరి ఎత్తిచూపిన ధర్మాసనం.. ఆయుర్వేద ప్రయోజనాలను నొక్కిచెప్పడానికి ఇతర వైద్య వ్యవస్థలను ఎందుకు తక్కువచేశారని ప్రశ్నించింది.
చట్టం అందరికీ ఒకటేనని ధర్మాసనంలో జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటానని రామ్‌దేవ్ బదులిచ్చారు. దీనిపై న్యాయస్థానం.. అంతకుముందు జరిగిన అన్ని పరిణామాల నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. మిమ్మల్ని క్షమించాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.