కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులు.. ఆ వెంకటేశ్వరస్వామి దర్శనంతో తాముపడిన వ్యయప్రయాసలను మర్చిపోతారు. శ్రీనివాసుడి క్షణకాల దర్శనం వారిని అన్నీ మరిపింపజేస్తుంది. అలా నిత్యం వచ్చే వేలాదిమంది భక్తుల ఆకలి తీరుస్తుంది అన్నదాన సత్రం. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. టీటీడీకి, అన్నదాన ట్రస్టుకు విరాళాలు అందిస్తుంటారు. మరింత మంది భక్తుల ఆకలి తీర్చేందుకు తమవంతు సాయం అందిస్తుంటారు.
తాజాగా కలకత్తాకు చెందిన ఓ భక్తుడు టీటీడీకి భారీ విరాళం అందించారు. కోల్ కతాకు చెందిన రాచిత్ పోద్దార్ అనే భక్తుడు ఎస్వీ అన్నదానం ట్రస్టుకు బుధవారం రూ 10 లక్షల వెయ్యి రూపాయలు విరాళం అందించారు. తిరుపతికి చెందిన తన ప్రతినిధి రాఘవేంద్ర అనే వ్యక్తి ద్వారా ఈ చెక్‌ను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామి తెప్పోత్సవాలు
మరోవైపు తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చకులు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన సేవలను నిర్వహించారు. ఆ తర్వాత సీతాలక్ష్మణసమేత కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నపన తిరుమంజనం సేవలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీరామచంద్ర పుష్కరిణిలో తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఆశీనులై విహరించి భక్తులను కటాక్షించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘురామకృష్ణరాజు
తిరుమల శ్రీవారిని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘరామకృష్ణరాజు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారి అర్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం మాట్లాడిన రఘురామకృష్ణరాజు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ వేసిన అనంతరం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చానన్నారు. స్వామి వారి ఆశీర్వచనం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారు.
![]() |
![]() |