టీడీపీ, బీజేపీ, జనసేనలది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయమని వైయస్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ అభివర్ణించారు. బుధవారం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ.... జరగబోయే ఎన్నికల్లో, జగన్ గారు ఒక్కరే ఒక వైపున ఉంటే... టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలిసి మరో పక్క ఉన్నాయి. కూటమి పేరుతో వీరంతా కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. అదే వ్యక్తులు.. పార్టీలే మారతాయి. చంద్రబాబు మనుషులంతా కూటమి పార్టీల్లో టికెట్లు తెచ్చుకుని, వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తారు. అందుకే వీళ్ళ కూటమి రాజకీయాన్ని కుమ్మక్కు రాజకీయం అని ప్రజలంటున్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులోనుంచే అనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ గుంపును హైనాలు, గుంటనక్కలు, తోడేళ్లు అనక ఇంకేమనాలి? వాళ్లు ప్రజల కోసం జత కట్టలేదు. ఎంతమంది కలిసైనా అధికారంలోకి వచ్చి, ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, పేదల నోట్లో మట్టికొట్టేందుకు, భూములు కొట్టేసి లక్షల కోట్లు సంపాదించాలని జతకట్టారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయంటే... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చాలా కాలం సోషల్ మీడియాలో కొండంత రాగం తీశారు. తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పాడు, ఆ తర్వాత 21 సీట్లు తీసుకుని సర్దుకున్నాడు. చివరికి నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లే. ఓటమి భయంతోనే పవన్ కల్యాణ్ ఇష్టానుసారం ప్రేలాపనలు పేలుతున్నాడు. తన పరిస్థితి ఏంటో అర్ధం కాక తనను అభిమానించే కాపుల్ని, కార్యకర్తలను కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు. అదే జగన్ గారు ప్రజల్ని నమ్ముకున్నారు.. ప్రజలు జగన్ గారిని నమ్మారు. అందుకే జగన్ గారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి గారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు కాబట్టే ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ గారు కచ్చితంగా గెలిచి రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అడవికి రాజు సింహం..ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ గారే. అందుకే సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నాం అని అన్నారు.