ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 143 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. విజయనగరం జిల్లాలో 19, శ్రీకాకుళం 13, పార్వతీపురం మన్యం 11, అనకాపల్లి 3 మండలాల్లో బుధవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. తూర్పుగోదావరి జిల్లాలో 19, కాకినాడ18, శ్రీకాకుళం 16, అనకాపల్లి 15, గుంటూరు 13, ఏలూరు 12, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, విజయనగరం 6, కృష్ణా 6, ఎన్టీఆర్ 5, పార్వతీపురం మన్యం 4, పశ్చిమగోదావరి 4, విశాఖపట్నం 3, పల్నాడు 2, బాపట్ల 1, తిరుపతి 1 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు.
మంగళవారం 66 మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో45.1, విజయనగరం జిల్లా జామిలో 44.9, వైయస్‌ఆర్ జిల్లా ఖాజీపేటలో44.6, కర్నూలు జిల్లా వగరూరులో44.2, అనకాపల్లి జిల్లా దేవరాపల్లెలో 44.1, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో43.8, శ్రీకాకుళం జిల్లా సారవకోట.. అల్లూరి సీతారామరాజు జిల్లా కొండైగూడెంలో43.7, తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, కళింగపట్నం, తుని, విశాఖపట్నంలో సాధారణ ఉష్ణోగ్రతలు 3నుంచి 6డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
రైల్వే శాఖను ఐఎండీ (భారత వాతావరణ శాఖ) అప్రమత్తం చేసింది. రైలు ప్రయాణికులు వడదెబ్బకు గురవుతారని హెచ్చరించింది. తాగునీరు అందుబాటులో ఉంచాలని, చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్య బృందాలు, మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించింది. రైలు ప్రయాణికులు తగినంత నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు తీసుకువెళ్లాలని సూచించింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌లపైన, బోగీల్లోనూ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ప్లాట్‌ఫామ్‌లపై చల్లదనం కోసం కూల్ రూఫ్‌లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది.