రేసు గుర్రం సహా పలు తెలుగు సినిమాల్లో నటించిన భోజ్‌పురి నటుడు రవికిషన్ శుక్లా...ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచే రవికిషన్‌కు మళ్లీ బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండగా.. ఓ వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. అపర్ణా ఠాకూర్ సోనీ అనే మహిళ ఏప్రిల్ 15న లక్నోలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. రవి కిషన్ తన భర్త అంటూ బాంబు పేల్చారు. తన కుమార్తె షినోవా సోనీని పరిచయం చేశారు. తాజాగా, రవికిషన్ తన తండ్రో? కాదో? తేల్చేందుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో సోనీ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ వివాదం తెరపైకి రావడం రవికిషన్‌కు ఇబ్బందికరంగా మారింది. రవికిషన్‌కు కుమార్తెగా చెప్పుకుంటున్న జూనియర్ నటి షినోవా సోనీ (25).. తన తల్లి అపర్ణా ఠాకూర్‌తో కలిసి ముంబయిలో నివసిస్తోంది. పలు చిన్న సినిమాల్లో నటించిన సోనీ.. మోడల్‌గానూ కొన్ని ప్రముఖ యాడ్స్ కోసం పనిచేశారు. కునాల్ కోహ్లీ తీసిన వెబ్ సిరీస్ 'హికప్స్ అండ్ హుకప్స్'లో నటి లారా దత్తాతో కలిసి షినోవా నటించారు.
బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన షినోవా.. ఎంపీ రవికిషన్‌ను తన తండ్రిగా పేర్కొన్నారు. ఈవిషయాన్ని తేల్చేందుకు రవికిషన్‌కు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరారు. ఒకవేళ ఈ డీఎన్‌ఏ నివేదిక అనుకూలంగా వస్తే తనను కుమార్తెగా రవికిషన్ గుర్తించాలని షినోవా సోనీ తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. కూతురిగా తన బాధ్యతను స్వీకరించడానికి రవికిషన్ నిరాకరించకుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆమె అభ్యర్థించారు.
అంతకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అపాయింట్‌మెంట్ కోరుతూ పోస్ట్ పెట్టారు. ‘గౌరవనీయులైన యోగి జీ.. నా పేరు షినోవా.. నేను మీ ఎంపీ రవి కిషన్ కుమార్తెను.. నేను, నా తల్లి మిమ్మల్ని కలవడానికి మాకు కొంత సమయం ఇవ్వండి.. ఆధారాలతో సహా నిజం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.. ఆ తర్వాత ఏది సరైందో మీరే నిర్ణయించండి’ అని కోరారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జర్నలిస్ట్ అపర్ణా ఠాకూర్‌కు.. 1995లో ఓ మీడియా సమావేశం సందర్భంగా రవికిషన్‌తో కూర్కు పరిచయం ఏర్పడింది. రెండోసారి కలిసినప్పుడు తనకు రవి కిషన్ ప్రపోజ్ చేశారని, ఆ తర్వాత తాము రిలేషన్‌షిప్‌లోకి వెళ్లామని అపర్ణ అంటున్నారు. బిగ్ బాస్ షోకి రవికిషన్ వెళ్లిన సమయంలో బ్రేకప్ అయ్యిందని చెప్పారు. రవికిషన్‌తో తన అనుబంధం వల్లే షినోవా జన్మించిందని అంటున్నారు. ఇక, ఈ వివాదంపై రవికిషన్ భార్య ప్రీతి స్పందించారు. గతంలో తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అత్యాచారం కేసు పెడతామని అపర్ణ బెదిరించినట్టు ఆరోపించారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.