ఓటమి భయంతో వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం నాడు దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.పెదవేగి మండలం లక్ష్మీపురంలో జరిగిన దాడి హేయనీయమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఆ పార్టీ నేతలు అమాయకులపై దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. లక్ష్మీపురంలో టీడీపీ నేతలు దాడి చేయించినట్లు వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని రోజులు టీడీపీపై ఇలా అసత్యాలు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తమపై నిరాధార ఆరోపణలు చేసి అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే నెల 13వ తేదీన దెందులూరు నియోజకవర్గ ప్రజలు టీడీపీ కూటమికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలందరూ ఆమోదించారని తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేతలకి ప్రజలే బుద్ధి చెబుతారని చింతమనేని ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు.