పట్టుచీర డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు సోదరుడిని హత్య చేయడంతో పాటు అడ్డువచ్చిన పెద్దమ్మ, మరో సోదరుడిని కత్తితో గాయపరిచాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన ధర్మవరం పట్టణంలోని గీతానగర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. వనటౌన పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గీతానగర్‌లో నివసిస్తున్న సావిత్రి మగ్గం నేసుకుంటూ పట్టుచీరలు అమ్ముతుండేది. ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దమణికంఠ, చిన్నమణికంఠ(23) ఉన్నారు. కాగా సావిత్రి కొంతకాలం క్రితం ఓ పట్టుచీరను తన చెల్ల్లెలు నారాయణమ్మ కుమారుడు రమేశకు రూ.10వేలకు అమ్మింది. అతను డబ్బు ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో శుక్రవారం రాత్రి సావిత్రితో పాటు పెద్దమణికంఠ, చిన్నమణికంఠ ఎదురు ఇంట్లో ఉన్న రమేశను డబ్బులు అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య మాటమాటపెరిగింది. చివరికి రమేశ ఇంటిలోని కత్తి తీసుకొచ్చి చిన్నమణికంఠను విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డువచ్చిన పెద్దమ్మ సావిత్రి, పెద్దమణికంఠపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తర్వాత పారిపోతుండగా స్థానికులు గమనించి రమేశను పట్టుకుని వనటౌన పోలీసులకు అప్పగించారు. అనంతరం చిన్నమణికంఠను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ అతనుచికిత్స పొందుతూ మృతిచెందాడు. సావిత్రి, పెద్దమణికంఠ గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. చిన్నమణికంఠ ఆరునెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య సుధారాణి గర్భిణి. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి రోధించింది. సావిత్రి ఫిర్యాదు మేరకు వనటౌన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.