ఏపీలో పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. మే ఒకటో తేదీ వస్తోంది.. పింఛన్ ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరిస్తారనే విషయాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెల మాదిరిగా మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు ఇళ్లవద్దనే పింఛన్ సొమ్ము అందించనున్నారు.
ఏపీవ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు అందుతున్నాయి. వీరిలో సుమారు 48 లక్షల 92 వేల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. బ్యాంకు అకౌంట్లు లేనివారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. మే ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకూ సచివాలయ ఉద్యోగులు వీరికి ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో మార్చి నెల వరకూ వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల పింఛన్లను అలాగే పంపిణీ చేశారు. అయితే ఎండాకాలం కావటంతో పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు వడదెబ్బ కారణంగా చనిపోయిన ఘటనలు ఏప్రిల్ నెలలో చోటుచేసుకున్నాయి. దీంతో పార్టీలన్నీ ఇళ్లవద్దనే పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలతో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయాలని, బ్యాంకు అకౌంట్లు లేనివారికి ఇంటివద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో పింఛన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.