ఇంట్లో ఎలుకలు బెడద పోవాలంటే ‘పిల్లులను పెంచేస్తే సరి..’ అనే మాటలు తరుచూ వినిపిస్తుంటాయి. కానీ ఎలుకల సమస్య అంత చిన్నదేమీ కాదు. మూషికాలు పంటలు, ఆవాసాలపై దాడి చేసి భారీగా నష్టాన్ని కలిగిస్తుంటాయి. వీటివల్ల కరువు సంభవించిన దాఖలాలు ఉన్నాయి. ఎలుకల బెడద తప్పించుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటికి విషం పెట్టి చంపడం, బోనులు ఏర్పాటుచేసి బంధించడం చేస్తుంటారు. అయితే, ఎలుకలను పట్టుకోవడానికి కూడా ఓ ఉద్యోగమే. ఇందుకు జీతం కింద లక్షల్లో చెల్లిస్తారు. తాజాగా, న్యూయార్క్ నగరంలో అధికారులు ఓ ర్యాట్ క్యాచర్‌ను నియమించుకుని.. అతడికి జీతం కింద ఏడాదికి రూ. 1.2 కోట్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు. అవును మీరు చదివింది నిజమే. ప్రపంచ ఆర్ధిక రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మూషికాలు రెచ్చిపోతున్నాయి.
సబ్‌వేలు, డ్రైనేజీలు, పార్కులు ఎక్కడ చూసినా ఎలుకల మందలే కనిపిస్తున్నాయి. వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల ఇది వార్తల్లోకి ఎక్కింది కూడా. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ను నియమించారు. ఇందుకోసం ఓ నోటిఫికేషన్ విడుదల చేసి.. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరిట ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించారు. దాదాపు 1000 దరఖాస్తులు రాగా.. వారిలో కేథలిన్ కొరాడీ అనే మాజీ ఉపాధ్యాయురాల్ని చివరకూ ఎంపిక చేశారు.
స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె.. ఎలుకల నియంత్రణ, వాటికి ఆహారం, నీళ్లు అందకుండా చూడటం వంటి అంశాలపై పరిశోధన చేశారు. దీంతో ఎలుకలను తగ్గించే బాధ్యతలను ఆమె భుజాన వేశారు. ఇళ్లలో మిగిలిపోయే ఆహారం, చెత్తను ఎలుకలకు దొరక్కుండా డిస్పోజ్ చేయడం, వాటి సంతతి తగ్గిపోయేలా చర్యలు తీసుకోవడం, సబ్‌వేలలో ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చూడటం ఆమె విధి. కానీ, విష పదార్థాలను పెట్టి ఎలుకలను చంపకూడదని షరతు విధించారు. ఎందుకంటే గతంలో ఆలా చేయడం వల్ల చనిపోయిన ఆ ఎలుకలను తిని ఇతర జంతువులు, పక్షులు మృత్యువాతపడ్డాయి. అందుకే విషం పెట్టొద్దనే నిబంధన పెట్టారు.
కొరడీ మీడియాతో మాట్లాడుతూ.. నార్త్ కరోలినాలో ఉండే మా నాయినమ్మ ఫోన్ చేసి చెప్పడంతో ఈ ఉద్యోగం గురించి తెలిసిందని అన్నారు. ఎలుకలు సమస్యలు ఒకరికే పరిమితం కాదు.. ఇది మనందరినీ ఇబ్బంది పెడుతుందని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో తనను అపాయింట్ చేశారని, అప్పటి నుంచి నగరంలో ఎలుకల నివారణకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కొరాడీ వెల్లడించారు.