శునకాలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటారు. చాలా మంది వాటిని తమ కుటుంబసభ్యులుగానే భావించి.. అవిభాజ్యమైన ప్రేమను చూపుతారు. వాటిని కన్నబిడ్డల్లా చూసుకుని, సపర్యలు చేస్తుంటారు. అయితే, ఓ యువకుడు ఏకంగా తన వివాహ ఆహ్వాన పత్రికలపై పెంపుడు శునకాల పేర్లను ముద్రించి వాటిపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలకు చెందిన యువకుడు పెళ్లి శుభలేఖ స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. ఏప్రిల్ 21న జరిగిన ఈ వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే... సాగర్ జిల్లాలోని రాణిపురకు చెందిన యశ్వంత్ రైక్వార్ ఐదేళ్ల కిందట తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా అతడి బైక్ కింద ఓ కుక్క పిల్ల పడింది. అయితే, అదృష్టవశాత్తు దానికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ఆ కుక్కను యశ్వంత్ తన ఇంటికి తీసుకెళ్లాడు. క్రమంగా శునకాలంటే యశ్వంత్కు ఇష్టం ఏర్పడటంతో మరో మూడు కుక్కలను ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో యశ్వంత్‌కు ఇటీవల వివాహం జరిగింది. ఈ క్రమంలో శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు.
ఆహ్వాన పత్రికలో ‘భౌ భౌ’ పార్టీ పేరుతో నాలుగు శునకాలు.. రాకీ, జోజో, కాలు, లాలూ పేర్లను ముద్రించాడు. హల్దీ వేడుక, సంగీత్, పెళ్లి ఊరేగింపు లాంటి ప్రతి కార్యక్రమంలో ఈ శునకాలను భాగం చేశాడు. వాటికి అతిథుల మాదిరిగానే స్వాగతం పలికాడు. అలాగే, ఊరేగింపునకు బయలుదేరే సమయంలో కుక్కలకు పసుపు, కుంకుమను పెట్టడం గమనార్హం. శునకాలపై యశ్వంత్కు ఉన్న ప్రేమ చూసి వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు.