లోక్‌సభ ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగున్న ఉన్న దేశాలకు లక్ష టన్నులకుపైగా ఉల్లి ఎగుమతులకు అనుమతించింది. కేంద్రం నిర్ణయంతో ఉల్లి రైతులకు ముఖ్యంగా మహారాష్ట్రవాసులకు మేలు జరగనుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)లకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. దీంతో పాటు మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు మరో 2 వేల టన్నుల తెల్లటిరకం ఉల్లి ఎగుమతులకు అనుమతులు ఇచ్చింది. ఈ ఎత్తివేత ఐదు నెలల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది.
ఈ దేశాలకు ఉల్లిని ఎగుమతి చేసే ఏజెన్సీ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ దేశీయ ఉత్పత్తులను చర్చల ప్రాతిపదికన 100% ముందస్తు చెల్లింపు రేటుతో ఎల్-1లో ఇ-ప్లాట్‌ఫారమ్ ద్వారా సేకరించి, సరఫరా చేసిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24లో ఖరీఫ్, రబీలో పంట దిగుబడి తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 8న కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తివేయడంపై ప్రధాని నరేంద్ర మోదీకి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు.శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం కోల్పోయాయని, రైతుల సమస్యలపై ప్రతిపక్షాలకు ఎన్నడూ ప్రాధాన్యం లేదని ఆయన విమర్శించారు.
ఈ ప్రకటనతో ఉల్లి రైతులు ఊపిరి పీల్చుకున్నారని కేంద్ర మంత్రి, దిండోరి బీజేపీ అభ్యర్థి భారతి పవార్ అన్నారు. దిండోరిలో ఉల్లి రైతులతో విమర్శలను ఎదుర్కొంటున్న పవార్.. ఇది రైతులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య అని నేను నమ్ముతున్నానని అన్నారు. డిండోరిలో ఉల్లి సాగు చేసే రైతులు గణనీయంగా ఉన్న నేపథ్యంలో వారి ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయి.
ఇక, కేంద్రం ప్రకటన దిండోరి నియోజకవర్గంలో పార్టీకి భారీ ఉపశమనం కలిగించిందని నాసిక్ బీజేపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘నిషేధం విధించిన తర్వాత చాలా అసంతృప్తితో ఉన్న ఉల్లి రైతులను ఆకర్షించడానికి ఇది మాకు సహాయపడుతుంది... ఇది ఎన్‌పీ (శరద్ పవార్ వర్గం) అభ్యర్థి భాస్కర్ భాగారేకు ప్రయోజనం కలిగించింది.. తాజా నిర్ణయంతో నియోజకవర్గంలో బీజేపీకి పరిస్థితులు మెరుగుపడతాయని మేము విశ్వసిస్తున్నాం’ బీజేపీ కార్యకర్త ఒకరు అన్నారు.
అయితే, ఉల్లి వ్యాపారులలో ఒక వర్గం మాత్రం నిషేధం ఎత్తివేతపై పెదవి విరిచింది. స్థానిక వ్యాపారి వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ‘నాసిక్ నుంచి ప్రతినెలా 48,000 టన్నుల ఉల్లి ఎగుమతి అవుతుంది.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ వంటి ఇతర జిల్లాలు ఉన్నాయి.. ఇక్కడ నుంచి తక్కువ మొత్తంలో ఎగుమతి జరుగుతుంది.. ఇంత తక్కువ మొత్తంలో ఎగుమతికి అనుమతించడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు.. ఏపీఎంసీల్లో టోకు ధరలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.’ అని అన్నారు.