గ్రహాంతరజీవుల ( ఏలియన్స్) ఉనికి కోసం దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. కొందరు తాము ఏలియన్స్‌ను చూశామని చెబుతుంటే.. మరికొందరు వాటిని ఫిక్షనల్ స్టోరీలుగా కొట్టివేస్తారు. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసుల ఉనికిపై ప్రపంచం కుబేరుల్లో ఒకరైన స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ ఉన్నారనేందుకు ఆధారలేవీ తనకు ఇప్పటివరకూ లభించలేదని ఆయన స్పష్టం చేశారు. దాదాపు పదేళ్ల కిందట అదృశ్యమైన ఇండోనేషియా ఎమ్‌హెచ్ 370 విమానం ఘటన వెనక ఏలియన్స్ హస్తం ఉండొచ్చంటూ ఓ నెటిజన్ ఎక్స్‌లో అనుమానం వ్యక్తం చేయగా.. దానిని మస్క్ తోసిపుచ్చారు. ఏలియన్స్ ఉనికిలో ఉన్నట్టు తనకు తెలిసుంటే వెంటనే ట్విట్టర్‌లో వెల్లడించి ఉండేవాడినని ఆయన పేర్కొన్నారు.
స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఆరు వేల శాటిలైట్లు భూమిచుట్టూ పరిభ్రమిస్తున్నాయని, కానీ, గ్రహాంతరవాసులకు సంబంధించి తమకు ఇప్పటివరకూ ఒక్క ఆధారం కూడా లభించలేదని మస్క్ తెలిపారు. మలేషియాకు చెందిన ఎమ్‌హెచ్ 370 విమానం 2014 మార్చి 8న కౌలలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళుతూ అకస్మాత్తుగా అదృశ్యమైంది. టేకాఫ్ అయిన 38 నిమిషాల తరువాత ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. అది దక్షిణ చైనా సముద్రం మీద ప్రయాణిస్తుండగా అది కనిపించకుండా పోయింది. ఆ ఘటనకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీ ఇదేనంటూ ఎక్స్‌లో నెటిజన్ ఓ వీడియోను పంచుకున్నాడు.
ఆ విమానం చుట్టూ వలయాకారంలో తిరుగుతున్న కొన్ని ఆకారాలను ఏలియన్స్‌కు చెందిన వాహనాలని తెలిపాడు. వాటి చుట్టూ ఓ శక్తి వలయం కూడా ఉందని, అవి గురుత్వాకర్షణ శక్తిని జయించగలిగాయని చెప్పాడు. ఈ వీడియోను ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేసిన మరో యూజర్.. ఆయన అభిప్రాయం కోరాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. తాను ఇంతవరకూ ఏలియన్స్ ఉన్నాయనేందుకు ఒక్క ఆధారం కూడా చూడలేదని స్పష్టం చేశారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన బోయింగ్ 777 విమానాన్ని మిలిటరీ రాడార్ మరో గంట పాటు ట్రాక్ చేసింది. నిర్దేశిత మార్గం నుంచి పశ్చిమం వైపునకు మళ్లి, అండమాన్ సముద్రం దాటినట్టు తెలిపింది.